ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ అక్రమాలకు సంబంధించిన మరిన్ని కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మార్చి 14న ఢిల్లీలో ఆయన నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి. లెక్కల్లో చూపించని నగదుగా అధికారులు గుర్తించారు. ఈ విషయం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి వెళ్లడంతో ఆయన్ను ప్రస్తుతం అలహాబాద్ కోర్టుకు బదిలీ చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా యశ్వంత్ వర్మ మోసాలకు సంబంధించిన ఓ కేసు వెలుగులోకి వచ్చింది. 2018లో నమోదైన సీబీఐ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీ బయటకొచ్చింది. చక్కెర మిల్లు బ్యాంక్ మోసానికి సంబంధించి 2018లో యశ్వంత్ వర్మపై కేసు నమోదైంది.
సింభోలి షుగర్ మిల్స్ డైరెక్టర్లు మరియు ఆ కంపెనీకి అప్పటి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న యశ్వంత్ వర్మతో సహా ఇతరులపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. చక్కెర మిల్లు పేరుతో మోసపూరితంగా రుణం తీసుకుని మోసం చేసినట్లుగా యశ్వంత్ వర్మపై ఆరోపణలు ఉన్నాయి.
తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంకు నుంచి రుణం తీసుకుని దుర్వినియోగం చేసినట్లుగా బ్యాంక్ ఆరోపించింది. అప్పట్లో కంపెనీకి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న యశ్వంత్ వర్మ పేరును ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. ఇక సింభోలి షుగర్ మిల్స్‌తో కలిసి రూ.900 కోట్ల రుణాలను మంజూరు చేయడంలో అనేక మంది బ్యాంకు అధికారులు కుమ్మక్కైనట్లు అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను సంప్రదించి కొన్ని ఆస్తులను బ్యాంకు స్వాధీనం చేసుకుంది. 2023, డిసెంబర్‌లో ఈ మోసం ‘‘మనస్సాక్షిని కదిలించిందని’’ కోర్టు పేర్కొంది. బ్యాంక్ అధికారులు ఆర్బీఐ మార్గదర్శకాలను, సర్క్యులర్‌లను పూర్తిగా విస్మరించారని పేర్కొంది. అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై దర్యాప్తు చేయాలని తాము సీబీఐకి ఆదేశించినట్లు కోర్టు తన ఉత్తర్వులో తెలిపింది.
2024లో సీబీఐ కొత్త దర్యాప్తు
అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఫిబ్రవరి 2024లో కొత్త దర్యాప్తు ప్రారంభించింది. సింభోలి షుగర్ మిల్స్ రుణ ఎగవేతదారుగా ఉన్నప్పటికీ 2009-2017 మధ్య బ్యాంకులు ఆ సంస్థకు రుణాలు ఎందుకు కొనసాగించాయో తెలుసుకోవడమే దీని లక్ష్యం. విచారణలో కంపెనీ, దాని డైరెక్టర్లు మరియు గుర్తు తెలియని బ్యాంకు అధికారుల పేర్లు ఉన్నాయి. ఇక 2024 మార్చిలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను నిలిపివేసింది.
జస్టిస్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం
మార్చి 14న జస్టిస్ యశ్వంత వర్మ నివాసంలోని స్టోర్ రూమ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 11:43 గంటలకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని చెల్లాచెదురుగా పడి ఉన్న నగదును గుర్తించారు. అనంతరం ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నగదు వీడియోలను రికార్డ్ చేసి ఢిల్లీ పోలీసులు.. సీనియర్ అధికారులకు పంచారు. అనంతరం భారత ప్రధాన న్యాయమూర్తికి సమాచారం అందించారు. దీంతో చీఫ్ జస్టిస్ విచారణకు ఆదేశించారు. దాదాపు రూ.15 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం.. జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది.