భారత సైన్యం అమ్ములపొదిలోని శక్తిమంతమైన ఆయుధంగా పరిగణించే బ్రహ్మోజ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. బుధవారం భారత ఆర్మీ అధికారులు ఈ క్షిపణిని అండమాన్ నికోబార్ దీవుల్లో విజయవంతంగా పరీక్షించారు. రష్యా సహకారంతో డీఆర్‌డీవో రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణితో భూతలం నుంచి భూతలానికి, భూమి నుంచి యుద్ధ విమానాలు, యుద్ద నౌకల వంటి టార్గెట్లను ధ్వంసం చేయవచ్చు. తాజాగా బ్రహ్మోస్ మిస్సైల్ రేంజ్ పెరగ్గా.. ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని రక్షణశాఖ అధికారులు పేర్కొన్నారు.
కాగా ఇటీవల మిస్‌ఫైర్‌తో పాకిస్తాన్‌లోకి ఓ సూపర్ సోనిక్ మిస్సైల్ దూసుకెళ్లి పేలిపోయిన విషయం తెలిసిందే. అది బ్రహ్మోస్ క్షిపణి అనే కథనాలు వచ్చినా భారత ప్రభుత్వం మాత్రం అది ఏరకం మిస్సైల్ అనే విషయం వెల్లడించలేదు. దీనిపై అధికారులు సమగ్ర విచారణ జరుపుతున్నారని.. నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేసిన తర్వాత పూర్తి వివరాలు బయటకు వస్తాయని రక్షణశాఖ అధికారులు చెప్తున్నారు. కాగా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం అయినందుకు రక్షణశాఖను ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి అభినందించారు.