AAP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఆప్ ఘోర పరాజయం పొందింది. మొత్తం 70 స్థానాలు ఉన్న అసెంబ్లీలో కాషాయ పార్టీ 48 సీట్లు గెలిస్తే, ఆప్ 22కే పరిమితమైంది. కాంగ్రెస్ అత్యంత దారుణంగా సున్నా స్థానాలకు పరిమితమై, 67 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఆప్ తన ఓటమికి కారణాలు వెతుక్కుంటోంది. ప్రధానంగా తమ ఓటమికి 3 కారణాలను ఆప్ నేతలు ప్రస్తావిస్తు్న్నారు.
* ఆప్‌కి దూరమైన మధ్యతరగతి:
2015, 2020లో ఆప్ ఘన విజయాలలో కీలక పాత్ర పోషించిన ఢిల్లీ మధ్యతరగతి, బిజెపి వైపు మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. సాంప్రదాయకంగా ఆప్‌కి ఓటేసి మిడిల్ క్లాస్ వర్గం ఈ సారి బీజేపీ వైపు వెళ్లారు. బడ్జెట్‌లో ప్రకటించిన 12 లక్షల వరకు పన్ను ఉపశమనం బీజేపీకి ప్లస్ అయినట్లు ఆప్ భావిస్తోంది.
* చివరి దశ ప్రచారం:
బీజేపీని క్లోజ్డ్ డోర్ మీటింగ్స్ ద్వారా అడ్డుకోవచ్చని ఆప్ భావించింది. అయితే, ప్రచారం చివరి దశలో ఆప్ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించలేదు. మరోవైపు, బీజేపీ చివరి వరకు ప్రచారాన్ని నిర్వహించింది. పార్టీ కార్యకర్తలు వ్యక్తిగతంగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి వారిని కలిశారు. ప్రచారం చివరి దశలో బీజేపీ ఎదుర్కోలేకపోయామని ఆప్ భావిస్తోంది.
* బీజేపీ డబ్బు బలం:
గత ఎన్నికల్లో కూడా బీజేపీ డబ్బు, మద్యం పంపిణీ చేసిందని ఆప్ నాయకత్వం విశ్వసిస్తోంది. కానీ, ఈ సారి డబ్బు, మద్యంతో పాటు భయాన్ని కూడా కలిపిందని ఆప్ చెబుతోంది. బీజేపీ మజిల్ పవర్, పోలీసుల్ని వాడి ఆప్‌కి ఓటర్లుగా ఉన్న జగ్గీ, మురికివాడల ఓటర్లలో భయాన్ని సృష్టించిందని ఆప్ చెబుతోంది. దీంతో ఎక్కువ మంది తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి బయటకు రాలేదని చెబుతోంది.