Rahul Gandhi: “వ్యవసాయ చట్టాలను” వ్యతిరేకించినందుకు దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ తనను బెదిరించాడని రాహుల్ గాంధీ అన్నారు. తనను బెదిరించడానికి బీజేపీ జైట్లీని తన వద్దకు పంపిందని శనివారం ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణల్ని బీజేపీ తిప్పికొట్టింది.ఆ సమయంలో అరుణ్ జైట్లీ బతికేలేరనే విషయాన్ని కాంగ్రెస్ నేత మరిచిపోయారని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ లీగల్ సెల్ సమావేశంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తే, ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని జైట్లీ తనను హెచ్చరించారని ఆయన పేర్కొన్నారు.
‘‘నేను వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు నాకు గుర్తుంది. ఆయన ఇప్పుడు ఇక్కడ లేరు. నేను నిజంగా చెప్పకూడదు. కానీ నేను చెబుతున్నాను. అరుణ్ జైట్లీ-జీని నన్ను బెదిరించడానికి నా దగ్గరకు పంపారు. మీరు ఇదే మార్గంలో కొనసాగితే, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడితే, మేము మీకు వ్యతిరేకంగా చర్య తీసుకోవలసి ఉంటుంది’’ అని అన్నారని రాహుల్ గాంధీ చెప్పారు.
Read Also: Prajwal Revanna: అత్యాచారం కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు..
ఆ సమయంలో ‘‘మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మీకు తెలియని అనుకుంటున్నాను. మేము కాంగ్రెస్ మనుషులం, పిరికివాళ్లం కాదు, మేము ఎవరి తలొగ్గం, బ్రిటీష్ వారు మమ్మల్ని వంచలేకపోయారు. మీరు ఎవరు..?’’ అని అన్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు.
అయితే, ఈ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీవి తప్పుదారి పట్టించే ప్రకటన అని అన్నారు. ‘‘2020లో వ్యవసాయ చట్టాలు వచ్చాయి. అరుణ్ జైట్లీ 24 ఆగస్టు, 2019లో మరణించారు. వ్యవసాయ బిల్లుల ముసాయిదా 2020 జూన్ 3న కేంద్ర కేబినెట్ ముందుకు వచ్చాయి. చట్టాలు సెప్టెంబర్ 2020లో అమలు చేయబడ్డాయి’’ అని మాల్వియా చెప్పారు. అరుణ్ జైట్లీ, రాహుల్ గాంధీని సంప్రదించారు, బెదిరించారనేది పూర్తిగా అబద్ధమని బీజేపీ తిప్పికొట్టింది.