Prajwal Revanna: గతేడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో సంచలనంగా మారిన ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ఈ రోజు కోర్టు తీర్పు వెల్లడించింది. అత్యాచారం కేసులో కోర్టు అతడికి ‘‘జీవితఖైదు’’ విధించింది. ప్రజ్వల్ రేవణ్ణపై ఆయన ఇంట్లో పనిచేసే మహిళ అత్యాచారం కేసు పెట్టింది. ఈ కేసులో ఆయనను బెంగళూర్ కోర్టు దోషిగా తేల్చింది. అత్యాచారం సమయంలో రికార్డ్ చేసిన వీడియోతో తనను బెదిరించినట్లు మహిళ ఫిర్యాదు చేయడంతో ప్రజ్వల్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలైన మహిళకు రూ. 7 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
Read Also: Malegaon blast case: మాలేగావ్ కేసులో మోడీ, యోగిని ఇరికించాలని కాంగ్రెస్ కుట్ర: ప్రజ్ఞా ఠాకూర్
జనతాదళ్ (సెక్యులర్) మాజీ ఎంపీ అయిన ప్రజ్వల్ రేవణ్ణ గత లోక్‌సభ ఎన్నికల్లో హసన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మాజీ ప్రధాని హెడ్‌డీ దేవెగౌడకు ప్రజ్వల్ మనవడు. 48 ఏళ్ల మహిళపై లైంగిక వేధింపుల వీడియోను ప్రసారం చేశాడని కూడా ఇతడిపై అభియోగాలు ఉన్నాయి.
హసన్ జిల్లాలో హోలెనరసిపురలోని రేవణ్ణ కుటుంబానికి చెందిన ఫామ్‌హౌజ్‌లో పనిచేస్తున్న మహిళపై 2021నుంచి ప్రజ్వల్ రేవణ్ణ పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ చర్యను వీడియో తీసి, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు మహిళ ఫిర్యాదు చేసింది. బెంగళూర్‌లోని ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు అతడిపై అత్యాచారం, లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు, సన్నిహిత చిత్రాలను చట్టవిరుద్ధంగా ప్రసారం చేయడం వంటి వివిధ సెక్షన్ల కింది శుక్రవారం అతడిని దోషిగా నిర్ధారించి, శనివారం శిక్షను విధించింది.
బాధితురాలి తరపున హాజరైన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిఎన్ జగదీష్ కోర్టులో మాట్లాడుతూ.. ఆమెపై పదే పదే అత్యాచారం జరిగిందని, బ్లాక్‌మెయిల్ చేశారని, ఆమెపై లైంగిక వేధింపుల వీడియో చూసిన తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని కూడా భావించారని చెప్పారు. ఇలాంటి కేసుల్లో డబ్బు, అధికారం ఉన్న వ్యక్తులకు ఈ శిక్ష గుణపాఠం కావాలని ఆయన అన్నారు.