Navaratri Special: సాధారణంగా ఏదైనా ఆలయానికి వెళ్తే భక్తులు ఆలయం బయటే చెప్పులు విడిచి లోపలకు వెళ్తారు. ఇది సంప్రదాయం కూడా. అలాంటిది దేవుడికి చెప్పులు సమర్పించడం ఎక్కడైనా చూస్తామా.. కానీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మాత్రం ఈ సన్నివేశం కనిపిస్తుంది. భోపాల్‌లోని కోలా ప్రాంతంలో జిజిబాయ్ ఆలయం, పహడావాలీ మాతా ఆలయానికి వెళ్లే భక్తులు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి చెప్పులు, షూలు సమర్పించి తమ కష్టాలు చెప్పుకుంటారు. దీనికి ఓ కారణముందని అక్కడి స్థానికులు వివరిస్తున్నారు. అక్కడి అమ్మవారు రాత్రిపూట చెప్పులు ధరిస్తుందని.. అమ్మవారికి చెప్పులు, షూలు సమర్పిస్తే ఆమె ప్రసన్నం అవుతుందని భక్తులు చెప్తున్నారు. దీంతో ఈ ఆచారం కొనసాగుతోందని పేర్కొన్నారు.
Read Also: Cooking Oil: వంట నూనెల దిగుమతిపై కేంద్రం గుడ్ న్యూస్
జిజిబాయ్ ఆలయంలోని అమ్మవారిని భక్తులు కుమార్తెగా భావిస్తారని.. అందుకే చెప్పులు, బూట్లతో పాటు టోపీ, కళ్లద్దాలు, వాచీ వంటివి కూడా భక్తులు సమర్పిస్తుంటారని ఆలయ పూజారి ఓంప్రకాష్ మహారాజ్ వెల్లడించారు. దసరా నవరాత్రుల సందర్భంగా విదేశాల్లో ఉండే భక్తులు సైతం అమ్మవారికి చెప్పులు, అలంకరణ సామాగ్రిని కానుకగా పంపిస్తారని ఆయన వివరించారు. ఈ ఏడాది ఉత్సవాల సందర్భంగా సింగపూర్, ప్యారిస్, జర్మనీ, అమెరికా వంటి దేశాలలో నివసించే భక్తుల నుంచి అమ్మవారికి చెప్పులు వచ్చాయని పూజారి తెలిపారు.