Abhishek Banerjee: కోల్‌కతాలో వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా హత్యాచారం జరిగింది. ఈ కేసుని సరిగా డీల్ చేయడంలో బెంగాల్ ప్రభుత్వం, పోలీసులు విఫలమైనట్లు కలకత్తా హైకోర్టు చీవాట్లు పెట్టింది. కేసుని సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా అరెస్ట్ చేశారు.
Read Also: Heavy Rain: వాతావరణ శాఖ మరో హెచ్చరిక.. మరో మూడు రోజుల్లో మరో ముప్పు..
ఇదిలా ఉంటే, ఈ ఘటన అధికార తృణమూల్ కాంగ్రెస్ సర్కార్, సీఎం మమతా బెనర్జీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్ర ప్రజలతో పాటు దేశం మొత్తం మమతా బెనర్జీపై దుమ్మెత్తిపోస్తోంది. ఇక సీఎం మమతా బెనర్జీతో పాటు ఆ పార్టీ నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల మమతా మాట్లాడుతూ.. బెంగాల్ తగలబెడితే ఢిల్లీ, ఒడిశా, బీహార్, అస్సాం, యూపీ తగలబడేలా చేస్తానని ప్రధాని మోడీని హెచ్చరించారు. ఇక ఆ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్, టీఎంసీ కౌన్సిలర్ భర్త అయిన అతిష్ సర్కార్ వ్యాఖ్యలు మరింత వివాదంగా మారాయి. ‘‘మేము మీ ఇళ్లలోకి దూరి మీ తల్లులు, అక్కాచెల్లెళ్ల అసభ్యకరమైన ఫోటోలు తీసి, గోడలకు వేలాడదీస్తాం’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అతడిని పార్టీ ఒక ఏడాది పాటు సస్పెండ్ చేసింది.
డ్యామేజ్ కంట్రోల్‌లో భాగంగా మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తన పార్టీ నేతలకు కీలక సూచలను చేశారు. “పార్టీ శ్రేణులకు అతీతంగా ప్రజా ప్రతినిధులు మరింత వినయంగా మరియు సానుభూతితో మెలగాలి. వైద్య సిబ్బంది లేదా సివిల్ సొసైటీకి చెందిన ఎవరి గురించి చెడుగా మాట్లాడవద్దని ప్రతి ఒక్కరినీ నేను కోరుతున్నాను, ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉంది. ఇది పశ్చిమ బెంగాల్‌ను ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల నుండి వేరు చేస్తుంది,” అని ట్వీట్ చేశారు. ఒక్క అతిష్ సర్కార్ మాత్రమే కాదు, టీఎంసీకి చెందిన మంత్రి ఉదయన్ గుహా, ఎంపీ కకోలి ఘోష్ దస్తిదార్, ఎమ్మెల్యే కంచన్ ముల్లిక్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.