Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీలు ముఖ్యంగా హిందువుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. తాజాగా, ఆ దేశ రాజధానిలో దుర్గా మాత ఆలయాన్ని కూల్చివేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై భారత్ నుంచి తీవ్ర ప్రతిస్పందన వచ్చింది. మరోవైపు, బంగ్లాదేశ్ అధికారులు ఈ చర్యను సమర్థించారు. ఆలయం తాత్కాలిక నిర్మాణం అని, చట్టవిరుద్ధంగా నిర్మించారని పేర్కొన్నారు.
‘‘ఢాకాలోని ఖిల్ఖేత్ లోని దుర్గా ఆలయాన్ని కూల్చివేయాలని అరాచకవాదులు నినాదాలు చేస్తున్నారని మేము అర్థం చేసుకున్నాము. తాత్కాలిక ప్రభుత్వం, ఆలయానికి భద్రత కల్పించడానికి బదులుగా, ఈ సంఘటన అక్రమ భూ వినియోగం కేసుగా చిత్రీకరించి, ఆలయాన్ని నాశనం చేశారు’’ అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ‘‘ దీని ఫలితంగా దేవతను మరో ప్రదేశానికి తరలించే ముందు నష్టం వాటిల్లింది. బంగ్లాదేశ్ లో ఇలాంటి పునరావృతం కావడం పట్ల మేము నిరాశ చెందాము. హిందువులను, వారి ఆస్తులను మరియు వారి మత సంస్థలను రక్షించడం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ బాధ్యత అని నేను నొక్కి చెబుతున్నాను’’ అని జైస్వాల్ అన్నారు.
Read Also: Operation Sindoor: జర్రయితే పాకిస్తాన్ సచ్చిపోయేదే.. చివరి నిమిషంలో ఇండియన్ నేవీ దాడులు ఆపేసింది..
గతేడాది ఆగస్టులో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చారు. ఆ తర్వాత మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి హిందువుల ఆస్తులు, ఆలయాలు, వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుంటూ మతఛాందసవాదులు దాడులకు పాల్పడుతున్నారు. పలు సందర్భాల్లో భారత్ తమ ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకాక్‌లో జరిగిన బిమ్స్‌టెక్ శిఖరాగ్ర సమావేశంలో ఇద్దరు నాయకుల మధ్య జరిగిన సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, యూనస్‌తో ఈ అంశాన్ని లేవనెత్తారు.
ఆలయాన్ని కూల్చివేయాలని మతోన్మాదులు డిమాండ్ చేసిన కొన్ని రోజుల్లోనే దుర్గా ఆలయాన్ని కూల్చేవారు. మూడు రోజుల్లోనే కూల్చివేత జరిగింది. పోలీసులు, సైనిక సిబ్బంది సహాయంతో బంగ్లాదేశ్ రైల్వే అధికారులు కూల్చివేతను నిర్వహించారు. ఖిల్‌ఖేట్ సర్బోజానిన్ శ్రీ శ్రీ దుర్గా మందిర్ రైల్వే భూమిలో అక్రమంగా నిర్మించబడినందున దానిని కూల్చివేశారని బంగ్లాదేశ్ రైల్వే అధికారులు చెబుతున్నారు.