Waqf Bill: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీసుకువచ్చింది. ఈ రోజు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టారు. అయితే, ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఆందోళనకు దిగాయి. రాష్ట్ర వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాలను కట్టడి చేయడంతో పాటు వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్, సర్వే, ఆక్రమణల తొలగింపుకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడం ఈ చట్టం యొక్క లక్ష్యం. 1995 వక్ఫ్ చట్టంలోని 44 సెక్షన్‌ని సవరించాలని చట్టం ప్రతిపాదించింది.
సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ఇద్దరు మహిళలు తప్పనిసరిగా ఉండాలని బిల్లు ప్రతిపాదిస్తుంది. వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చే డబ్బును ప్రభుత్వం సూచించిన పద్ధతిలో వితంతువులు, విడాకులు తీసుకున్నవారు మరియు అనాథల సంక్షేమానికి ఉపయోగించాలని కూడా నిర్దేశించింది. మహిళల వారసత్వ సంపదకు రక్షణ కల్పించాలన్నది మరో కీలక ప్రతిపాదన. వక్ఫ్ సంస్థల్లో ముస్లిమేతర సభ్యులను చేర్చాలనే నిబంధన ప్రతిపాదిత చట్టంలోని మరో వివాదాస్పద అంశం.
Read Also: Waqf board Bill: వక్ఫ్ బోర్డు మాఫియా వశమైంది.. ప్రతిపక్షాలపై కేంద్రం ఆగ్రహం..
ఇదిలా ఉంటే, లోక్‌సభలో బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఇది కఠినమైన చట్టమని, మతస్వేచ్ఛ, సమాఖ్య వ్యవస్థపై దాడి అని అన్నారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించడాన్ని ఆయన వ్యతిరేకించారు. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ కూడా ఈ బిల్లుని వ్యతిరేకించింది. ఈ బిల్లును బాగా ఆలోచించి రాజకీయాల్లో భాగంగా ప్రవేశపెట్టారని విమర్శించింది. ప్రజాస్వామ్య ప్రక్రియ ఉన్నప్పుడు వ్యక్తుల్ని ఎందుకు నామినేట్ చేయాలని ప్రశ్నించింది. ముస్లిం కాని వారిని వక్ఫ్ బోర్డులో నామినేట్ చేయడం ఏమిటి..? అని ప్రశ్నించింది. ఇది మైనారిటీ వర్గానికి వ్యతిరేకమని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు.
వక్ఫ్ బోర్డుల పనితీరును మెరుగుపరిచేందుకే ఈ బిల్లును తీసుకువచ్చినట్లు బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. 1984లో ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన సిక్ వ్యతిరేక అల్లర్లను ఆయన ప్రస్తావించారు. ‘‘వేల మంది సిక్కులను ఎవరు చంపారు?’’ అని కాంగ్రెస్‌ని ప్రశ్నించారు. ఈ బిల్లుపై సరైన సంప్రదింపులు జరగలేదని, దీనిని స్టాండింగ్ కమిటీకి పంపాలని చెప్పారు.