Peace Pact Signed With 8 Tribal Militant Groups Of Assam: అస్సాం ప్రభుత్వం, గిరిజన తీవ్రవాద సంస్థల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో శాశ్వత శాంతి నెలకొల్పేందుకు ఈ ఒప్పందం ముందడుగు కానుంది. అస్సాంతో దశాబ్ధాల కాలంగా ఉన్న తీవ్రవాద సమస్యను పరిష్కరించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం 8 తీవ్రవాద సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. గురువారం గౌహతిలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నేతృత్వంలో ఈ ఒప్పందం జరిగింది.
ఆల్ ఆదివాసీ నేషనల్ లిబరేషన్ ఆర్మీ, అస్సాంకు చెందిన ఆదివాసీ కోబ్రా మిలిటెంట్, బిర్సా కమాండో ఫోర్స్, సంతాల్ టైగర్ ఫోర్స్, ఆదివాసీ పీపుల్స్ ఆర్మీ సహా ఎనిమిది గ్రూపుల మధ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య త్రైపాక్షిక ఒప్పందంపై కేంద్ర హోంమంత్రి అమిత్ సమక్షంలో ఇక్కడ సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందం వల్ల అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలు నెలకొననున్నాయి. ఒప్పందం వల్ల అస్సాంలో శాంతి, సామరస్యాలతో కూడిన కొత్త శకం ప్రారంభం అవుతుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు.
పరేష్ బారుహ్ నేతృత్వంలోని నిషేధిత ఉల్ఫాకు చెందిన కరడుగట్టిన తీవ్రవాద సంస్థ కమతాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్ మినహా.. రాష్ట్రంలో క్రియాశీలకంగా ఉన్న అన్ని ఉగ్రవాద సంస్థలు ప్రభుత్వంలో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. జనవరిలో తివా లిబరేషన్ ఆర్మీ, గూర్ఖా యునైటెడ్ పీపుల్స్ ఆర్గనైజేషన్లకు చెందిన ఉగ్రవాదులు ప్రభుత్వం ముందు లొంగిపోయారు. ఆగస్టులో కుకీ గిరిజన సంఘం తీవ్రవాదులు తమ ఆయుధాలను విడిచిపెట్టారు. అంతకుముందు 2020లో బోడో మిలిటెంట్ గ్రూపుకు చెందిన 4,100 మంది కార్యకర్తలు ప్రభుత్వం ముందు లొంగిపోయారు.
అస్సాం, ఈశాన్య రాష్ట్రాలకు ఇది ముఖ్యమైన రోజని.. ఈశాన్య ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు మోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని.. అస్సాంలో దాదాపుగా 1100 మంది ఆదివాసీ తీవ్రవాద సంస్థల ఉగ్రవాదులు జనజీవన స్రవంతిలో కలవడం ముఖ్య పరిణామంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈశాన్య రాష్ట్రాలను మాదక ద్రవ్యాల రహితంగా, ఉగ్రవాద రహితంగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నామని.. ఆ దిశగా కేంద్ర కృషి చేస్తుందని ఆయన అన్నారు.