Asaduddin Owaisi: నాగాలాండ్ రాష్ట్రంలో శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ, బీజేపీ సంకీర్ణానికి మద్దతు ఇవ్వడంపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. నాగాలాండ్ ఎన్సీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నేఫియు రియోకు మద్దతు ప్రకటించిన తర్వాత అసదుద్దీన్ శరద్ పవార్ పై విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు గానూ ఎన్డీపీపీ-బీజేపీ పార్టీలు 37 స్థానాలను కైవసం చేసుకున్నాయి.
Read Also: Congress Worker : డ్యాన్సర్‌పై కనక వర్షం.. వివాదం అవుతున్న వీడియో
దీనిపై అసదుద్దీన్ మాట్లాడుతూ.. శరద్ ఒకవేళ ‘‘షాదాబ్’’ అయితే అతడిని బీజేపీకి బీ టీమ్ అని, సెక్యులర్లకు అంటరాని వారిగా మారిపోయేవారంటూ వ్యాఖ్యానించారు. ఎంఐఎం ఎప్పుడూ బీజేపీకి మద్దతు ఇవ్వలేదని, ఎన్సీపీ బీజేపీకి మద్దతు ఇవ్వడం ఇది రెండోసారని, ఇది చివరి సారి కాకపోవచ్చని అన్నారు. పలు పార్టీలు ఎంఐఎంను బీజేపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
శరద్ పవార్ తన పార్టీకి చెందిన నవాబ్ మాలిక్ జైలులో పెట్టిన వారికి మద్దతు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగాలాండ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎన్సీపీ ముఖ్యమంత్రి నిఫియో రియోకు మద్దతు ఇస్తున్నట్లు శరద్ పవార్ నిర్ణయించుకున్నట్లు ఎన్సీపీ ఈశాన్య ఇన్ ఛార్జ్ నరేంద్ర వర్మ వ్యాఖ్యలు చేసిన తర్వాత అసదుద్దీన్ ఓవైసీ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. నాగాలాండ్ లో బీజేపీ 12 స్థానాలను గెలుచుకోగా.. ఎన్సీపీ 8 స్థానాలను గెలుచుకుంది. సీఎంగా నిఫియో రియో, ఎన్‌డిపిపికి చెందిన ఏడుగురు, బిజెపికి చెందిన ఐదుగురు మంత్రులతో కూడిన క్యాబినెట్‌తో మార్చి 7న ఆయన ఐదవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.