Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో హామీ ఇచ్చారు. ఢిల్లీలో మరోసారి అధికారంలోకి రాగానే మంచి నీటి బిల్లులను మాఫీ చేస్తామని తెలిపారు. తప్పుడు మంచినీటి బిల్లులను మాఫీ చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రతినెలా 20 వేల లీటర్ల ఉచిత మంచి నీరు అందిస్తున్నాం.. ఇది12 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది అని చెప్పారు. ఇక, తాను జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీ ప్రజలకు తప్పుడు నీటి బిల్లులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఆ నీటి బిల్లును చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.. ఎవరి బిల్లు అయితే తప్పుగా వచ్చిందని భావిస్తున్నారో.. వారు నీటి బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు అని తేల్చి చెప్పారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ రావడం ఖాయం, అధికారంలోకి రాగానే తప్పుడు బిల్లులను మాఫీ చేస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
Read Also: Kamala Harris: ప్రతిజ్ఞ చేస్తూ తడబడిన కమలా హారిస్.. నెట్టింట తీవ్ర విమర్శలు
ఇక, కాంగ్రెస్, బీజేపీ కలిసి ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా..? లేదా అనేది ప్రజలకు చెప్పాలని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. లోపాయికార ఒప్పందంతో రెండు పార్టీలు పోటీ చేస్తున్నాయి.. బీజేపీకి ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరో తెలియదు.. ఢిల్లీ అభివృద్ధిపై బీజేపీకి విజన్ లేదు.. ఆమ్ ఆద్మీ పార్టీని దూషించి ఎన్నికల్లో గెలవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది అన్నారు. తాము అధికారంలో ఉన్న పదేళ్లలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం.. మా పనిని చూసి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.. వచ్చే ఐదేళ్లలో ఏ పనులు చేస్తామో కూడా చెప్పి ఓటు అడుగుతున్నాం.. ఇక, ప్రజలు కాంగ్రెస్ ను సీరియస్ గా తీసుకోవడం లేదు అని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.