Imran khan: జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ నాలుగేళ్ల క్రితం కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ కొంత మంది సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. దీనిపై అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవంగా.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. ఆర్టికల్ 370 రద్దు సక్రమమే అని తీర్పు ఇచ్చింది.
అయితే ఈ తీర్పుపై దాయాది దేశం పాకిస్తాన్ తన అక్కసు వెల్లగక్కుతోంది. ఇప్పటికే తీర్పుకు విలువలేదని పాకిస్తాన్ అభివర్ణించగా.. దాని మిత్రదేశం చైనా, కాశ్మీర్ అంశాన్ని ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరింది. ఇదిలా ఉంటే పాక్ మాజీ ప్రధాని, ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కూడా భారత సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టారు.
ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ భారత సుప్రీంకోర్టు తీర్పు కాశ్మీర్ సమస్యను మరింత క్లిష్టతరం చేస్తుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. రావల్పిండి అడియాల జైలులో ఖైదీగా ఉన్న ఇమ్రాన్ ఖాన్.. భారత్ అత్యున్నత న్యాయస్థానం తీర్పు యూఎన్ఎస్‌సీ తీర్మానాలను పూర్తిగా ఉల్లంఘించడమే అని ఒక సందేశంలో పేర్కొన్నారు. ‘‘భారత అత్యున్నత న్యాయస్థానం యొక్క వివాదాస్పద మరియు చట్టవిరుద్ధమైన నిర్ణయం దశాబ్దాలుగా కొనసాగుతున్న సంఘర్షణను పరిష్కరించడానికి సహాయం చేయడానికి బదులుగా కాశ్మీర్ సమస్యను మరింత క్లిష్టతరం చేస్తుందని ఖాన్ స్పష్టం చేశారు’’ అని అతని పార్టీ పీటీఐ ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొంది.