Operation Sarvashakti: జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని తిప్పికొట్టేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధమైంది. లోయలో మళ్లీ ఉగ్రవాదాన్ని పెంచేందుకు ఇటీవల పూంచ్, రాజౌరీ ప్రాంతాల్లో టెర్రరిస్టులు దాడులకు పాల్పడుతున్నారు. పిర్ పంజాల్ పర్వతాలను, అక్కడి అడవుల్లో దాక్కుంటూ భద్రతా సిబ్బందికి సవాల్ విసురుతున్నారు. ఈ ప్రాంతంలోని గుహలు, కొండలు, అడవులు ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారడంతో వారిని ఏరేసేందుకు చేస్తున్న ఆపరేషన్లు కష్టంగా మారాయి. ఇటీవల జరిగిన ఉగ్రదాడుల్లో అధికారులతో సహా జవాన్లు 20 మంది మరణించారు. డిసెంబర్ 21న నలుగురు సైనికులను బలిగొన్నారు.
Read Also: Seema Haider: రాముడిని దర్శించుకునేందుకు కాలినడక అయోధ్య వెళ్తానంటున్న పాక్ మహిళ..
ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల్ని ఏరిపారేసేందుకు ఆర్మీ ‘ఆపరేషన్ సర్వశక్తి’ని ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. పిర్ పంజాల్ పర్వత శ్రేణుల రెండు వైపుల నుంచి ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను నిర్వహించనున్నారు. శ్రీనగర్ లోని చినార్ కార్ఫ్స్‌తో పాటు నగ్రోటాలోని వైట్ నైట్ కార్ఫ్స్‌తో ఏక కాలంలో ఆపరేషన్ నిర్వహిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా రాజౌరీ, పూంచ్ సెక్టార్లలో ఇటీవల కాలంలో పెరిగిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణిచేందుకు జమ్మూ కాశ్మీర్, సీఆర్పీఎఫ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తాయని వారు తెలిపారు. 2003లో దక్షిణ పిర్ పంజాల్ శ్రేణిలో ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ సర్ప్‌వినాశ్’లాగే తాజా ఆపరేషన్ ఉండబోతోంది.
ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు ఆర్మీ అధికారులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో ఇటీవల హోంమంత్రి అమిత్ షాతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఉగ్రవాదులపై సమన్వయ చర్యల కోసం అత్యున్నత సమావేశం నిర్వహించారు.