కర్ణాటక ప్రభుత్వం వివాదాస్పద మతమార్పిడి నిరోధక బిల్లుపై ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. మత మార్పిడి నిరోధక బిల్లుపై ఈ రోజు సీఎం బస్వరాజ్ బొమ్మై కేబినెట్ సమావేశం అయ్యింది. ఈ బిల్లుపై ఆర్డినెన్స్ తెస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ, మండలి ప్రొరోగ్ కావడంతో బొమ్మై సర్కార్ ఈ ఆర్డినెన్స్ నిర్ణయం తీసుకుంది.
కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు బిల్లును 2021 డిసెంబర్ లో కర్ణాటక శాసనసభ ఆమోదించింది. ప్రభుత్వంలో బీజేపీ ఉండటంతో పాటు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండటంతో అక్కడ బిల్లు సులువుగానే పాస్ అయింది. అయితే ఇదే సమయంలో శాసన మండలిలో బీజేపీకి మెజారిటీ లేకపోవడంతో ముందుకు వెళ్లలేదు. దీంతో ప్రస్తుత బిల్లును ఉనికిలోకి తీసుకురావడానికి క్యాబినెట్ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే బీజేపీ ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. ఇంత త్వరగా బిల్లుపై ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏం వచ్చిందంటూ కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాగా, ఇటీవల కాలంలో కర్ణాటకలో మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో హిజాబ్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విద్యాలయాల్లోకి హిజాబ్ ను ధరించి రావడాన్ని నిషేధించింది కర్ణాటక ప్రభుత్వం. అయితే ఈ నిర్ణయంపై కర్ణాటక హైకోర్ట్ … విద్యాలయాల్లోకి హిజాబ్ నిషేధాన్ని సమర్థించింది, ఇస్లాంలో హిబాజ్ అనేది తప్పనిసరి ఆచారం కాదని తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్ట్ లో ఉంది. ఇదిలా ఉంటే కొన్ని జిల్లాల్లో ముస్లింలు నడిపే దుకాణాల్లో వస్తువులు కొనవద్దని కొన్ని హిందూ సంస్థలు చెప్పడం కూడా వివాదాస్పదంగా మారింది. తాజాగా కర్ణాటక ప్రభుత్వం రాత్రి నుంచి ఉదయం వరకు లౌడ్ స్పీకర్ల వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.