ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ గా క్యాప్ బెల్ విల్సన్ ను నియమిస్తూ టాటా సన్స్ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఎయిర్ ఇండియాను ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమ్మివేసిన సంగతి తెలిసిందే. టాటా గ్రూప్ రూ. 18,000 కోట్లతో కొనుగోలు చేసింది. గతేడాది అక్టోబర్ లో టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను చేజిక్కించుకోగా… ఈ ఏడాది జనవరి నుంచి టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తీసుకుంది.
ఇదిలా ఉంటే ముందుగా ఎయిర్ ఇండియా చీఫ్ గా టర్కీకి చెందిన ఇల్కర్ ఐసీని నియమించారు. ఈ నియామకంపై దేశీయంగా విమర్శలు వచ్చాయి. టర్కీ ఎయిర్ లైన్ అధికారిగా ఉండటంతో పాటు టర్కీ దేశానికి చెందిన వ్యక్తి కావడంతో కొన్ని వర్గాల నుంచి ఇల్కర్ ఐసీపై విమర్శలు వచ్చాయి. చాలా సందర్భాల్లో ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ మద్దతుగా వ్యవహరించడంతో పలువురు టాటా నిర్ణయాన్ని వ్యతిరేఖించారు. ఈ సమయంలోనే ఐసీ తను ఎయిర్ ఇండియా సీఈఓగా బాధ్యతలు తీసుకోబోవడం లేదని స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సీఈఓగా క్యాప్ బెల్ విల్సన్ నియమించింది టాటా సన్స్.
ప్రస్తుతం క్యాంప్ బెల్ విల్సన్ తక్కవ ధరల విమానయాన సంస్త ‘స్కూట్’ కు చీఫ్ గా ఉన్నారు. తాజాగా ఎయిర్ ఇండియా సీఈఓగా నియమితులు కావడంతో ఆ పదవికి రాజీనామా చేశారు. 50 ఏళ్ల విల్సన్ దాదాపుగా 25 ఏళ్లకు పైగా విమానయాన సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. క్యాంప్ బెల్ విల్సన్ 1996లో న్యూజిలాండ్ లో సింగపూర్ ఎయిర్ లైన్స్ మేనేజింగ్ ట్రైనీగా కెరీర్ ప్రారంభించారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి సింగపూర్ ఎయిర్ లైన్స్ అనుబంధ సంస్థ అయిన స్కూట్ కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో పెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన ఎయిర్ ఇండియా సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.