AICC President Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఆ పార్టీ సమాయత్తం అవుతోంది. 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో తిరిగి సోనియా గాంధీనే అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. అయితే.. ఆరోగ్య కారణాల రీత్యా సోనియా గాంధీ ఈ పదవిని సమర్థవంతంగా చేపట్టలేకపోతున్నారు. మరో వైపు రాహుల్ గాంధీ కూడా ఈ సారి అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సారి కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడు రావచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Read Also: MK Stalin: ఇది ఇండియా.. “హిండియా” కాదు.. అమిత్ షా వ్యాఖ్యలపై స్టాలిన్ ఫైర్
తాజాగా ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల కోసం షెడ్యూల్ ఖారారు అయింది. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. ఏఐసీసీ ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రాల్లోని అన్ని పీసీసీ కార్యలాయాల్లో ఓటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులందరికీ పార్టీ గుర్తింపు కార్డుల ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. ఐడెంటిటీ కార్డులపై క్యూఆర్ కోడ్ ఉంటుందని.. ఐడీ కార్డుపై ఫోటో లేకుంటే ఆధార్ కార్డు తప్పని సరి అని ఆయన తెలిపారు. ఈ నెల 20 తరువాత ఓటర్ లిస్ట్ తయారు చేయబడుతుందని ఆయన వెల్లడించారు. బుధవారం ప్రదేశ్ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు. ఏఐసీసీ ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా జరుగుతాయని.. ఎవరూ ఎటువంటి అపోహలు, అనర్థాలు పెట్టుకోవద్దని అన్నారు. ఏఐసీసీ ఎన్నికలకు ఒక్కరి కన్నా ఎక్కువ మంది పోటీ పడితేనే ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు.
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్:
నోటిఫికేషన్ – 22 సెప్టెంబర్
నామినేషన్ల ప్రారంభం – 24 సెప్టెంబర్
నామినేషన్లను చివరి రోజు- 30 సెప్టెంబర్
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక – 17 అక్టోబర్
రాహుల్ గాంధీ డౌటే..
ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ పోటీ చేయకపోవచ్చనే మాటే వినిపిస్తోంది. అయితే గాంధీ పార్టీకి అనుకూలంగా ఉండే వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిని చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వరసలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను అధ్యక్ష పదవి వరించే అవకాశం ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఉంటేనే బాగుంటుందని చాలా మంది కాంగ్రెస్ నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.