MK Stalin comments on hindi diwas: హిందీ భాషా దినోత్సవం ‘ హిందీ దివాస్’ రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. బుధవారం సూరత్‌లో జరిగిన అఖిల భారత అధికార భాషా సదస్సులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. హిందీ భాష ఇతర భాషలకు పోటీదారు కాదని.. హిందీ అన్ని భాషలకు మిత్రుడని వ్యాఖ్యానించారు. కొందరు హిందీని గుజరాతీ, తమిళం, మరాఠీ భాషలకు పోటీదారుగా తప్పుగా భావిస్తున్నారని ఆయన వ్యాక్యానించారు. హిందీ అధికార భాషగా మొత్తం దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువస్తుందని ఆయన అన్నారు.
అయితే తాజాగా అమిత్ షా వ్యాఖ్యలపై డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ లోని అన్ని భాషలను అధికార భాషలుగా పరిగణించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశ సంస్కృతి మరియు చరిత్రను బలోపేతం చేయడానికి సెప్టెంబర్ 14 ను “హిందీ దివస్” కాకుండా “భారతీయ భాషల దినోత్సవం”గా పాటించాలని ఆయన అన్నారు. కేంద్ర హోం మంత్రికి స్థానిక భాషలపై శ్రద్ధ ఉంటే.. హిందీతో సమానంగా అన్ని భాషలకు నిధులు కేటాయించాలని స్టాలిన్ అన్నారు. జాతీయ విద్యా విధానం ద్వారా హిందీని అమలు చేసేందుకు కేంద్రం మొగ్గు చూపుతోందని విమర్శించారు.
Read Also: Hyderabad Crime: బాలిక గ్యాంగ్ రేప్ కేసులో కొత్త ట్విస్ట్.. ఇంత జరిగిందా..?
ఇది ఇండియా అని.. హిండియా కాదని ఆయన వ్యాఖ్యానించారు. తమిళంతో సహా భారతీయ భాషలను దూరం చేయాలనే ఉద్దేశ్యంతోనే హిందీని ‘‘ జాతీయ భాష’’గా చూపేందుకు ఢిల్లీలో అధికారంలో ఉన్న వాళ్లు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు స్టాలిన్. ఉత్తర భారతదేశంలోని మైథిలీ, భోజ్ పురి భాషలు హిందీ కారణంగా అంతరించి పోతున్నాయని అన్నారు. భారతదేశం సంస్కృతి, చరిత్రను అర్థం చేసుకోవడానికి హిందీ నేర్చుకోవాలని చెప్పడం భారత దేశంలోన భిన్నత్వంలో ఏకత్వానకి విరుద్ధం అని ఆయన అన్నారు.
రాజ్యాంగ సభ హిందీని అధికార భాషగా స్వీకరించిన సెప్టెంబర్ 14న ప్రతీ ఏడాది హిందీ దివాస్ గా జరుపుకుంటున్నారు. ఎనిమిదో షెడ్యూల్ లో ఉన్న 22 భాషలను అధికారిక భాషలుగా పరిగణించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ డిమాండ్ చేశారు. దేశాన్ని హిండియా చేసే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. హిందీ మాట్లాడని రాష్ట్రాలపై కేంద్రం హిందీని బలవంతంగా రుద్దుతుందని ఆయన ఆరోపించారు.