ప్రపంచంలోని చాలా దేశాల్లో భారతీయులు నివశిస్తున్నారు. ఉద్యోగాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్తుంటారు. భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లోని జైళ్లలో ఎంతమంది భారతీయులు ఉన్నారు అనే దానిపై భారత విదేశాంగ సహాయమంత్రి వీ మురళీధరన్ పార్లమెంట్‌లో వివరణ ఇచ్చారు. విదేశీ జైళ్లలో 7925 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. యూఏఈ జైళ్లలో 1663 మంది భారతీయులు ఖైదీలుగా ఉండగా, సౌదీ అరేబియాలో 1363 మంది, నేపాల్‌లో 1039 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారని కేంద్రం తెలిపింది.
Read: Google: గూగుల్ మరో కీలక నిర్ణయం… ప్రారంభించిన మూడేళ్లకే ఆ సేవలు బంద్…
అయితే, ఇందులో అండర్ ట్రయల్స్‌గా ఉన్న ఖైదీలు కూడా ఉన్నారని మంత్రి తెలియజేశారు. భారతీయ ఖైదీలను స్వదేశానికి రప్పించేందుకు వీలుగా కేంద్రం 35 దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు పేర్కొన్నారు. అండర్ ట్రయల్స్, శిక్ష పడిన ఖైదీలు శిక్షాకాలంలో మిగిలిన కాలాన్ని భారతీయ జైళ్లలో గడపవలసి ఉంటుంది. అయితే, మరణశిక్ష పడ్డవారికి మాత్రం ఈ సౌలభ్యం ఉండదని కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో తెలియజేశారు.