‘బజ్రంగీ భాయ్ జాన్’ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించి ఉంటే ఎలా ఉండేది? ఇదేం సంబంధం లేని ప్రశ్న అనుకుంటున్నారా? లింక్ ఉంది… అదేంటంటే…
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ‘బజ్రంగీ భాయ్ జాన్’ మూవీకి స్టోరీ రైటర్. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే, సల్మాన్ నటించిన క్రాస్ బార్డర్ ఎమోషనల్ స్టోరీ ఆయన ముందుగా రాజమౌళికే చెప్పాడట. కానీ, అప్పట్లో ‘బాహుబలి’ బిజీలో ఉన్న జక్కన్న నాన్నగారికి ‘సారీ’ చెప్పేశాడట.
దాంతో విజయేంద్ర ప్రసాద్ తన ఇండో-పాక్ క్రాస్ బార్డర్ క్లాసిక్ డ్రామాని సల్మాన్ ముందు ఉంచాడు. వెంటనే బాలీవుడ్ భాయ్ జాన్ ‘బజ్రంగీ భాయ్ జాన్’గా మారేందుకు రెడీ అన్నాడట. ఆ తరువాత టీమ్ లోకి డైరెక్టర్ గా కబీర్ ఖాన్ వచ్చి చేరాడు. ఆపైన ఏం జరిగిందో యావత్ దేశానికి తెలిసిందే! 300 కోట్లకు పైగా సల్మాన్, కరీనా, హర్షాలీ మెహతా స్టారర్ ఆర్జించి పెట్టింది! రాజమౌళి ‘బజ్రంగీ భాయ్ జాన్’ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎలా మిస్సైంది… విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. అయితే, సినిమా విడుదల తరువాత బాక్సాఫీస్ రిజల్ట్ చూసి చాలా నెలలు బాధపడ్డాడట మన దర్శక ‘బాహుబలి’! సల్మాన్ తో సూపర్ డూపర్ ఆఫర్ మిస్ అయ్యానని ఆయన పశ్చాత్తాపం చెందాడట! కాకపోతే, రాజమౌళి ‘బాహుబలి’తో అంతకంటే ఎక్కువ దుమారమే రేపాడు బాలీవుడ్ లో! అదీ అసలు విశేషం…