Chiranjeevi: 45 సంవత్సరాల నటన… 154 సినిమాల అనుభవం… వెరసి తెలుగు సినిమాకు అతనిని చిరంజీవిని చేసింది. మెగాస్టార్ గా చిరంజీవి సాధించిన విజయాల గురించి చెప్పవలసిన అవసరమే లేదు. ఎందుకుంటే అది అందరికీ తెలిసిన విషయమే. అయితే సినిమాల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, అంచనాలు అప్పుడప్పుడూ తప్పవచ్చేమే కాని నటుడుగా మాత్రం ఎప్పుడూ పోషించిన పాత్రలకు న్యాయం చేస్తూనే సాగారు. ఇక ఎదుటివారికి చిరు ఇచ్చే మర్యాద, మన్నన గురించి ఆయనను కలసిన ప్రతి ఒక్కరూ ఎప్పుడూ గొప్పగా చెబుతూనే ఉంటారు. మైత్రీ మూవీస్ నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. రవితేజ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచింది.
నిజానికి ఈ సినిమా విడుదల రోజున డివైడ్ టాక్ వినిపించింది. దానికి కారణం సినిమాలో చిరంజీవి పాత్ర కేవలం ఎంటర్ టైన్ మెంట్ వేలోనే సాగడం ఓ కారణం. కాగా, ఆ పాత్రకు బ్రదర్ గా రవితేజ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రకు గౌరవం ఇచ్చేలా ఉండటం మొదట్లో చిరంజీవి వీరాభిమానులకు నచ్చలేదు. ఇక్కడే చిరంజీవి అనుభవం బయటపడింది. ఎక్కడ నెగ్గాలో… ఎక్కడ తగ్గాలో ఆయనకు బాగా తెలుసని రుజువైంది.
రవితేజ క్యారెక్టర్ ఎలివేట్ అయితేనే సినిమాకు ప్లస్ అవుతుందని గ్రహించే చిరంజీవి తన పాత్ర విషయంలో తగ్గారు. ‘వాల్తేరు వీరయ్య’గా నెగ్గారు. సంక్రాంతి విజేతగా నిలిచారు. ఒక వేళ తను హీరో కదా అని అన్నింటా డామినేట్ చేస్తూ వెళితే అది సినిమాకు ఇబ్బందిగా మారి ఉండేది. మెగా ఫ్యాన్స్ ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నారంటే అది కేవలం చిరంజీవి వల్లనే. ఇక ఇందులో దర్శకుడు బాబీ చిరంజీవితో హమ్ చేయించిన ‘జంబలకడి జారు మిఠాయి’ కానీ, ‘చేసే మూడ్, ఉత్సాహం సర్వనాశనం అయిపోయాయి’ అనే ఫ్రస్ట్రేషన్ డైలాగ్ కానీ థియేటర్లలో నవ్వులు పూయించాయి. సాధారణంగా టాప్ స్టార్ ఎవరూ వీటిని పలకటాకినికి అంత ఆసక్తి చూపించరు. కానీ చిరంజీవిలో ఆ కామెడీ టింజ్ ఉంది కాబట్టే సై అన్నారు… ఆడియన్స్ తో జై కొట్టించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు యు.ఎస్ లోనూ భారీ వసూళ్ళను సాధిస్తున్న ‘వాల్తేర్ వీరయ్య’ ముందు ముందు ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.