రాధేశ్యామ్ సినిమా చిత్రీకరణ దశలో ఉన్నప్పుడు.. అప్డేట్స్ ఇవ్వండంటూ ఫ్యాన్స్ ఎంత హంగామా చేశారో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఓవైపు ఇతర సినిమాల నుంచి ఒకదానికి మించి మరొక అప్డేట్స్ వస్తోంటే, రాధేశ్యామ్ మేకర్స్ మాత్రం మౌనం పాటించడంతో ట్విటర్‌లో రకరకాల ట్రెండ్‌లకు తెరలేపారు. ఇప్పుడు ఆదిపురుష్ సినిమా విషయంలోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో.. #WakeUpTeamAdiPurush అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్విటర్‌లో ట్రెండ్ చేస్తున్నారు.
నిజానికి.. ఆదిపురుష్ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఇప్పుడు యూనిట్ మొత్తం గ్రాఫిక్స్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని ముగించే పనిలో నిమగ్నమైంది. షూటింగ్ ముగిసింది కాబట్టి, యూనిట్ నుంచి అప్పుడప్పుడు ఏమైనా అప్డేట్స్ వస్తాయేమోనని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, మేకర్స్ వారి ఆశలపై నీళ్ళు చల్లుతూ.. ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. ఇందులో ప్రభాస్ రాముడు పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి.. శ్రీరామ నవమి రోజు గ్రాండ్ అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ భావించారు. ప్రభాస్ ఫస్ట్ లుక్‌ని కచ్ఛితంగా రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ, మేకర్స్ ట్విస్ట్ ఇస్తూ కేవలం ఫ్యాన్ మేడ్ వీడియోతో సరిపెట్టింది. అప్పుడు ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారు.
పోనీ, ఆ తర్వాతైనా ఏమైనా అప్డేట్స్ వస్తాయి అనుకుంటే, అదీ లేదు. దీంతో విసుగెత్తిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్.. ట్విటర్‌లో #WakeUpTeamAdiPurush అనే హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. ఇది నేషన్‌వైడ్ ట్రెండ్ అవుతోంది. మరి, ఈ ట్రెండ్‌పై చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా.. ఈ సినిమాను తొలుత ఈ ఏడాది ఆగస్టులోనే రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ, గ్రాఫిక్స్ వర్క్ చాలా ఎక్కువగా ఉండడంతో వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. ఇందులో ప్రభాస్ సరసన సీత పాత్రలో కృతీ సనన్ నటిస్తోంది.