Vinaro Bhagyamu Vishnu Katha Terailer: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కాశ్మీర జంటగా మురళి కిషోర్ దర్శకత్వం వహించిన చిత్రం వినరో భాగ్యం విష్ణుకథ. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఫోన్ నెంబర్ నైబర్ అనే కొత్త కాన్సెప్ట్ తో కిరణ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మనకు ఉన్న పది అంకెల ఫోన్ నెంబర్ చివరి అంకె ముందు, వెనుక ఉన్నవారిని ఫోన్ నెంబర్ నైబర్స్ అంటారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. మనీ హైస్ట్ థీమ్ డ్రెస్ ల్లో ఉన్న ఒక గ్యాంగ్ కు కిరణ్ తన కథను చెప్తున్నట్లు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.
విష్ణు అనే యువకుడికి ఒక ఫోన్ కాల్ వస్తోంది.. అటు నుంచి ఒక అమ్మాయి మాట్లాడుతూ తను..ఫోన్ నెంబర్ నైబర్ అని పరిచయం చేసుకొంటుంది. అలా వారిద్దరి పరిచయం ప్రేమ వరకు వెళ్ళుతోంది. ఇక ఈ అమ్మాయిని దేవుడే పంపాడు అని విష్ణు స్నేహితులు కూడా చెప్పడంతో ఆమెతో ప్రేమలో పడిపోతాడు. అయితే హీరోయిన్ ఫోన్ నెంబర్ ఇవతల నెంబర్ హీరోది అయితే అవతల నెంబర్ విలన్ ది అన్నట్లు చూపించారు. దానివలన ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చివరికి జైలుకు కూడా వెళ్లినట్లు చూపించారు. ఆమెకోసం విష్ణు చేసిన పోరాటమే సినిమా కథగా తెలుస్తోంది. మంచి మంచి అని ఇక్కడి వరకు తెచ్చుకున్నావు.. ఆడపిల్ల తలమీద కీరిటం ఉంటుంది.. అది కిందపడకుండా ఉండాలంటే వాళ్లెప్పుడూ తలదించుకోకూడదు అని కిరణ్ చెప్పిన డైలాగ్స్ తో ఇందులో హీరోయిన్ పాత్ర కు మంచి ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. ఇక మురళి శర్మ కామెడీ సినిమాకు హైలైట్ గా నిలువనుందని ట్రైలర్ చూస్తూనే తెలిసిపోతోంది. చైతన్య భరద్వాజ్ సంగీతం ఆకట్టుకొంటుంది. మొత్తానికి ట్రైలర్ తో కిరణ్సినిమాపై అంచనాలను పెంచేశాడు. మరి ఈ సినిమాతోనైనా కిరణ్ అబ్బవరం మంచి హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.