శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రం వరుణ్ తేజ్, సాయి పల్లవి కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి. అటు వసూళ్లలోనూ, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ లోను ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. అయితే తాజాగా వరుణ్, సాయిపల్లవి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ‘ఛలో’ ‘భీష్మ’ సినిమాలతో తనదైన ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఇటీవల వరుణ్ తేజ్ కి ఒక కథ వినిపించి ఓకే చేశారనే టాక్ నడుస్తోంది. కథానాయికగా సాయిపల్లవినే సంప్రదిస్తున్నారనేది తాజా సమాచారం. అయితే మరోవైపు దర్శకుడు వెంకీ కుడుముల అక్కినేని నాగచైతన్యతోను సినిమా ఒప్పించే పనిలో ఉన్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఆయన ఎవరితో తీయనున్నారనే విషయం తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!