తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే సూపర్ డూపర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు మెగా ఫ్యామిలీ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత వచ్చిన ‘కొండపొలం’ మాత్రం ఈ కుర్రహీరోని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా ‘రంగ రంగవైభవంగా’ చేస్తున్నాడు. అతి త్వరలోనే ఆ సినిమా జనం ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా వైష్ణవ్ తేజ్ తో సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నాగవంశీ, త్రివిక్రమ్ భార్య లక్ష్మీ సౌజన్య ఈ చిత్రానికి నిర్మాతలు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వైష్ణవ్ తేజ్ సరసన ‘పెళ్ళి సందడి’ ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ పోషించబోయే పాత్ర ఇంటెన్సిటీని తెలియచేస్తూ, ఓ డైలాగ్ టీజర్ ను మేకర్స్ బుధవారం విడుదల చేశారు.”రేయ్… రాముడు లంక మీద పడింది వినుంటావు. అదే పది తలల రావణుడు అయోధ్య మీద పడితే ఎట్టుంటుందో చూస్తావా?’ అని ప్రతినాయకుడు పలికితే, ”ఈ అయోధ్యలో ఉండేటిది రాముడు కాదప్ప, ఆ రావణుడే కొలిచే రుద్ర కాళేశ్వరుడు. తలలు కోసి చేతికిస్తా నాయాలా… చూసుకుందాం… రా!!’ అంటూ వైష్ణవ్ తేజ్ దీటుగా బదులిస్తాడు. రాయలసీమ నేపథ్యంలో మాస్ యాక్షన్ మూవీగా ఇది తెరకెక్కబోతోందని ఈ డైలాగ్ టీజర్ తో అర్థమౌతోంది.
‘వారసుడు’తో పోటీ!
ఇదిలా ఉంటే… ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో అగ్ర కథానాయకుల చిత్రాలు కొన్ని ఉంటాయనే వార్తలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ‘వారసుడు’ సంక్రాంతికే రానుంది. మరి ఆ సీజన్ కు ఉన్న సౌలభ్యం దృష్ట్యా మరో రెండు మూడు సినిమాలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏదేమైనా ఇంకా సెట్స్ పైకి వెళ్ళకముందే వైష్ణవ్ తేజ్ తన నాలుగో చిత్రం కోసం సంక్రాంతి సీజన్ లో కర్చీఫ్ వేసేశాడు.