తొలి చిత్రం ‘ఉప్పెన’తో కలెక్షన్ల సునామి సృష్టించాడు మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఈ యేడాది ఫిబ్రవరి 12న ప్రేమికుల దినోత్సవ కానుకగా వచ్చిన ‘ఉప్పెన’ వైష్ణవ్ తేజ్ కెరీర్ కు గట్టి పునాది వేసింది. విశేషం ఏమంటే ఈ సినిమా విడుదలకు ముందే ‘కొండపొలం’ నవల ఆధారంగా క్రిష్… వైష్ణవ్ తేజ్ తో సినిమాను తెరకెక్కించాడు. క్రిష్ సొంత నిర్మాణ సంస్థలో రూపొందిన ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ నాయికగా నటించింది.
సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేయాల్సిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి అనివార్య కారణంగా సొంతవూరు వెళ్ళి, అక్కడి తమ పశువులను తీసుకుని, ఊరి కుర్రాళ్ళతో కలిసి అడివికి వెళతాడు. క్రూర మృగాలు ఉన్న ఆ అడవిలో తన గొర్రెలను, మేకలను ఈ యువకుల బృందం కాపాడుకోగలిగిందా? అసలు ఇవాళ పల్లెలు వదలి నగరాలకు వెళుతున్న యువత సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతోందా? ఇలాంటి మౌలికమైన ప్రశ్నలు, వాటికి జవాబులతో అన్నపురెడ్డి వెంకటరెడ్డి ‘కొండపొలం’ నవల రాశారు. నవలల పోటీలో బహుమతి పొందిన దీనిని క్రిష్ తెరకెక్కించాడు.
ఈ చిత్రం షూటింగ్ ను క్రిష్ ఇప్పటికే పూర్తి చేసినా గ్రాఫిక్ వర్క్ కారణంగా ఆలస్యం అయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే అడివిలోని క్రూర జంతువులను, ముఖ్యంగా పులితో హీరో చేసే పోరాట సన్నివేశాలను గ్రాఫిక్స్ లోనే సృష్టించాల్సి ఉంది. అయితే… ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తుది దశకు చేరుకుందని అంటున్నారు. ఈ విజువల్ వండర్ మూవీని దసరా కంటే ఓ వారం ముందే అంటే అక్టోబర్ 8న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. నిజానికి ఈ యేడాది దసరాకు వస్తుందని భావించిన ‘ట్రిపుల్ ఆర్’ మూవీ వచ్చే యేడాది జనవరి 26కు వాయిదా పడిందన్నది అనధికారిక సమాచారం. దాంతో దసరా బరిలో నిలిచేందుకు ఇప్పటి నుండే పలు చిత్రాలు పోటీ పడబోతున్నాయి. అందులో వైష్ణవ్ తేజ్ రెండో సినిమా ‘కొండపొలం’ ఉంటుందని అనుకోవచ్చు.