నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీలో నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో ఆరో ఎపిసోడ్ భలే సందడి చేసిందనే చెప్పాలి. ‘అఖండ’ విజయం సాధించిన ఉత్సాహం ఓ వైపు… ‘పుష్ప’ విజయసువాసనలు మరో వైపు పరిమళిస్తూండగా సాగిన ‘అన్ స్టాపబుల్’ టాక్ షో రక్తి కట్టించింది. ఈ కార్యక్రమంలో ‘పుష్ప’ డైరెక్టర్ సుకుమార్ ముందుగా హాజరయ్యారు. తరువాత నాయిక రష్మిక వచ్చేసింది. చివరలో అల్లు అర్జున్ రాగానే సందడి మరింత పెరిగింది. 47 నిమిషాల పాటు సాగిన ఈ సందడి భలేగా ఆకట్టుకుంది. బాలయ్య, బన్నీ ఫ్యాన్స్ కు ఇది కన్నుల పండుగేనని చెప్పవచ్చు.
విశ్వనాథ్ గుర్తుకు వచ్చారు…
సుకుమార్ ను వెల్ కమ్ చేస్తూ బాలకృష్ణ, యన్టీఆర్ ‘శ్రీక్రిష్ణపాండవీయం’లోని “కైపున్న మచ్చెగంటి చూపు… అది చూపు కాదు పచ్చల పిడిబాకు… పచ్చల పిడిబాకు విచ్చిన పువురేకు… గుచ్చుకుంటే తెలుస్తుందిరా… మనసిచ్చుకుంటే తెలుస్తుంది రా…” అంటూ ఆలపించి ఆకట్టుకున్నారు. “మీ సినిమాలు చూశాను… మీ ఆర్టిస్టులను హ్యాండిల్ చేసే తీరు చూస్తే విశ్వనాథ్ గారు గుర్తుకు వస్తారు” అంటూ ఆరంభంలో అదిరిపోయే కాంప్లిమెంట్ ఇచ్చేశారు
రెండు వర్గాలు…
బాలయ్య.. మీ వూరంతా చిరంజీవిగారి బెల్టేగా అని అంటే, “మావూళ్ళో రెండు వర్గాలండి…చిరంజీవిగారి ఫ్యాన్స్… బాలకృష్ణగారి ఫ్యాన్స్…” అని చెప్పారు సుకుమార్. అలాగే తమ ఇంట్లో నలుగురు అన్నదమ్ముల్లో పెద్దన్నయ్య బాలకృష్ణ ఫ్యాన్ అనీ, చిన్నన్నయ్యలు చిరంజీవి ఫ్యాన్స్ అని చెప్పి, వారు తనను సినిమాకు తీసుకెళ్తే అవి హిట్టయ్యేవని వివరించారు సుకుమార్. అలాగే సుకుమార్ ‘మేథమేటిక్స్’ గురించి అడిగారు బాలయ్య. తరువాత తనకు మ్యాథ్స్ లో రెండు ఫార్ములాలు వచ్చునన్నారు. అవేవంటే “సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా” అని చెప్పగానే సుకుమార్ “ఈక్వల్స్ టు వన్” అని చెప్పారు. దానికి బాలయ్య, “అది నేనే” అంటూ టక్కున సమాధానం చెప్పడం ఆకట్టుకుంది. తనలోని లోటు ‘కన్ ఫ్యూజన్’ అని సుకుమార్ నిజాయితీగా చెప్పడం కూడా అలరించింది. తన సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కు ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తానో సుకుమార్ వివరించారు. తన ‘ఆర్య’లో బన్నీని, డీఎస్పీని ఎలా ఎంపిక చేసుకున్నదీ సుకుమార్ తెలిపారు. తన కథే తన శత్రువు, మిత్రుడు అని సుకుమార్ చెప్పడం మురిపించింది.
రష్మికతో చిందు…
రష్మికను వెల్ కమ్ చేస్తూ బాలయ్య కన్నడలో మాట్లాడడం కూడా ఆకట్టుకుంది. అలాగే ‘పుష్ప’లోని “సామీ…సామీ…” పాటకు రష్మికతో కలసి బాలయ్య కూడా చిందేయడం మరింతగా ఆలరించిందనే చెప్పాలి. సుకుమార్, రష్మిక ఇద్దరికీ రెండు పలకలు ఇచ్చి, బాలయ్య అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వారు రాయడం, ఆ జవాబులు గిలిగింతలు పెట్టేలా ఉండడం ఎంతగానో మురిపించాయి.
చెట్టు రామయ్యతో…
ఈ కార్యక్రమంలో ‘వృక్షో రక్షతి రక్షితః’ అంటూ పాటుపడి, పద్మశ్రీ అవార్డు సొంతం చేసుకున్న చెట్టు రామయ్య ప్రత్యేక అతిథిగా విచ్చేయడమూ అలరించింది. రామయ్య దంపతులకు బాలకృష్ణ, సుకుమార్ పాదాభివందనం చేశారు. ‘చెట్టు నాటితే ప్రాణవాయువు వస్తుంది’ అనే నినాదాన్ని తామూ పాటించి, ముందుకు తీసుకువెళ్తామని బాలయ్య, సుకుమార్ చెప్పారు.
బన్నీ సందడి!
ఇక చివరలో అల్లు అర్జున్ ఈ టాక్ షోలో పాల్గొన్నారు. ఆయన ఎంట్రీ గతంలో వచ్చిన అతిథులెవరికీ లేనంత ప్రత్యేకంగా డిజైన్ చేయడం విశేషం! “మీరు ‘అఖండ’తో స్టార్ట్ చేశారు, ‘పుష్ప’తో కంటిన్యూ చేశాం, ఇది ఇక్కడితో ఆగకూడదు. ఇది తెలుగు చలనచిత్ర విజయం” అంటూ బన్నీ చెప్పడం విశేషంగా నిలచింది. బాలయ్య ‘పుష్ప’లా నడవడం, తగ్గేదే లే అనడం ఆకట్టుకున్నాయి. అదే తీరున అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్ తో బాలయ్య చేసిన సందడి మునుపటి ఎపిసోడ్స్ లో కంటే మరింతగా రేగింది. సుకుమార్ తో తన సినిమా దసరాకి కొబ్బరికాయ, క్రిస్మస్ కు గుమ్మడి కాయ, సంక్రాంతికి రిలీజ్ అని చాటింపేశారు బాలయ్య.
ఈ ఆరో ఎపిసోడ్ చూస్తే, బాలకృష్ణ ప్రతీ ఎపిసోడ్ కూ తన చలాకీతనాన్ని పెంచుకుంటూ వచ్చారనిపిస్తుంది. బాలయ్య సినిమాల్లోని పాటల్లో ఆయన ఎనర్జీ లెవెల్స్ చూసి అవాక్కవుతూ ఉంటారు జనం. సరే, అదేదో టేక్స్ ఉంటాయి కాబట్టి, అలా చూపిస్తారు అనుకుంటారు. కానీ, ఈ టాక్ షోలో ఆయన స్పాంటేనిటీ, ఎనర్జీ లెవెల్స్ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి.