‘అల్లరి’ నరేశ్, దర్శకుడు విజయ్ కనకమేడల ఫస్ట్ కాంబినేషన్ లో వచ్చిన ‘నాంది’ చిత్రం చక్కని ప్రేక్షకాదరణ పొందడమే కాదు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఆ సినిమా విజయం అందించిన స్ఫూర్తితో తాజాగా వీరిద్దరూ కలిసి ‘ఉగ్రం’ సినిమాను ప్రారంభించారు. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ‘ఉగ్రం’ రెగ్యులర్ షూటింగ్ సోమవారం నాడు మొదలైంది. ఇందులో నాయికగా మలయాళీ ముద్దుగుమ్మ మిర్నా మీనన్ ను ఎంపిక చేశారు. తన తొలిచిత్రం ‘నాంది’ని విలక్షణ కథతో తెరకెక్కించిన విజయ్ కనకమేడల ఈ సినిమా కోసం కూడా డిఫరెంట్ స్టోరీని ఎంపిక చేసుకున్నట్టు ఫస్ట్ లుక్ పోస్టర్ తో తెలిసింది.
తాజాగా సినిమా షూటింగ్ మొదలైన సందర్భంగా విడుదల చేసిన చిన్నపాటి వీడియో కూడా డిఫరెంట్ గా ఉండి ఈ మూవీపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఈ సినిమాను ‘కృష్ణార్జున యుద్థం, మజిలీ, గాలి సంపత్, టక్ జగదీశ్’ చిత్రాల నిర్మాతలు సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. తూము వెంకట్ ‘ఉగ్రం’కు కథను అందించగా, అబ్బూరి రవి మాటలు రాశారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చుతున్నారు.