తెలుగు చిత్రసీమలో కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు తమ బ్యానర్ లోగోలో మహానటుడు నటరత్న యన్.టి.రామారావు బొమ్మను పెట్టుకొని తమ అభిమానం చాటుకున్నాయి. పుండరీకాక్షయ్యకు చెందిన తారకరామ పిక్చర్స్ లోగోలో యన్టీఆర్ శ్రీరాముని గెటప్ లో కనిపిస్తారు. ఇక సి.అశ్వనీదత్ తమ వైజయంతీ మూవీస్ బ్యానర్ లోగోలో పాంచజన్యం పూరిస్తోన్న శ్రీకృష్ణునిగా యన్టీఆర్ బొమ్మనే పొదువుకున్నారు. అదే తీరున యన్టీఆర్ అభిమాని అయిన దర్శకుడు వై.వి.యస్. చౌదరి తాను నిర్మాతగా మారి ‘బొమ్మరిల్లు’ పతాకంపై తొలి ప్రయత్నంగా ‘లాహిరి లాహిరి లాహిరిలో…’ చిత్రం నిర్మిస్తూ తమ బ్యానర్ లోగో ప్రదర్శించక ముందే ‘రక్తసంబంధం’లోని యన్టీఆర్ బొమ్మను కొలువు దీరేలా చేశారు. అంతేకాదు దివికేగిన నటసార్వభౌముని స్మరించుకుంటూ “నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నిను కొలుచు భాగ్యం ఇంకెప్పుడూ ప్రభూ… ఈ జన్మకు…” అంటూ ప్రార్థన కూడా వినిపిస్తుంది. అందులోనే నటరత్న అంటే వైవియస్ చౌదరికి ఎంతటి భక్తి ప్రపత్తులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బొమ్మరిల్లు బ్యానర్ పై వై.వి.యస్.చౌదరి నిర్మించి, దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘లాహిరి లాహిరి లాహిరిలో…’ 2002 మే 1న విడుదలై విజయఢంకా మోగించింది. ఇందులో తన అభిమాన నటుడు యన్టీఆర్ తొలి నటవారసుడు నందమూరి హరికృష్ణతో కీలక పాత్ర పోషింప చేయడం విశేషం!
‘లాహిరి లాహిరి లాహిరిలో…’ కథ విషయానికి వస్తే – నాని, బాల ఒకే చోట చదువుకుంటూ ఉంటారు. అనాథ అయిన నాని బ్రతుకు తెరువు కోసం ‘ఏ వన్ మ్యాచ్ ఫిక్సింగ్ సెంటర్’ నడుపుతూ పెళ్ళిసంబంధాలు కుదురుస్తూ ఉంటాడు. నాని మంచితనం బాలను ఆకర్షిస్తుంది. అయితే అతను బిజినెస్ మైండెడ్ అని భావించి, గుడ్ బై చెబుతుంది. అమ్మాయమ్మ తన ముగ్గురు మేనకోడళ్ళకు పెళ్ళి సంబంధాలు చూడమని నాని దగ్గరకు వస్తుంది. రామాపురంకు చెందిన బలరామయ్య నాయుడుకు ముగ్గురు కొడుకులు – కృష్ణమనాయుడు, చంద్రమనాయుడు, శ్రీనివాస నాయుడు ఉన్నారని చెబుతాడు నాని. ఆ అబ్బాయిలు తమ మేనకోడళ్ళు ఇందు, చందు, సింధుకు సరిపోతారని అమ్మాయమ్మ భావిస్తుంది. ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్ళకు తాను తమ్ముడిగా నాని రామాపురం వెళతాడు. అక్కడే ఆ నలుగురూ బలరామయ్య ఇంటికి ఎదురుగా ఉండే ఇల్లు అద్దెకు తీసుకొని దిగుతారు.
బలరామయ్య ఏకైక పుత్రిక బాల అన్న విషయం నానికి తెలుస్తుంది. ఎలాగైనా ఆమె అన్నలకు కొత్తగా తనకు లభించిన అక్కలకు పెళ్ళి చేయాలని భావిస్తాడు. ఆ మూడు జంటల నడుమ ప్రేమ చిగురించేలా చేస్తాడు. బాల, నాని ప్రేమించుకుంటారు. అంతా సవ్యంగా జరుగుతోందని అనుకుంటూ ఉండగా, కోళ్ళ పందెంలో బలరామయ్య కోడి పక్కవూరి వారి కోడితో ఓడిపోతుంది. తమ ఊరి గౌరవం కాపాడడానికి అన్నట్టు బలరామయ్య కుటుంబంతో సదా పోటీ పడే అచ్చమాంబ తన కోడిని బరిలోకి దించి గెలుస్తుంది. ఈ అచ్చమాంబ ఒకప్పుడు బలరామయ్యను పెళ్ళాడాలని ఆశిస్తుంది. కానీ, బలరామయ్య తాను కోరుకున్న అమ్మాయిని పెళ్ళాడి ఉంటాడు. అందువల్లే సదా ఆమెకు బలరామయ్య కుటుంబంపై పై చేయి సాధించాలన్న తలంపు ఉంటుంది.
కోడి పందెం గెలవగానే తన తమ్ముడు కొడుక్కి బాలను ఇచ్చి పెళ్ళి చేయమని కోరుతుంది అచ్చమాంబ. తమ రెండు కుటుంబాల మధ్య వైరం సమసిపోయేందుకు బలరామయ్యతో సంబంధం కలుపుకోవాలని భావిస్తున్నట్టు చెబుతుందామె. అందుకు ఆయన కూడా అంగీకరిస్తారు. చెల్లి మనసు తెలుసుకున్న బలరామయ్య పెద్దకొడుకు కృష్ణమనాయుడు ఆమె కోరుకున్నవాడితో అదీ అచ్చమాంబ చూస్తూండగా అగ్నిసాక్షిగా వారి ప్రేమను ఆశీర్వదిస్తాడు. దాంతో అచ్చమాంబ మరింతగా రెచ్చిపోయి , నాయుడు కుటుంబాన్ని అంతం చేయాలని చూస్తుంది. ప్రతీసారి కృష్ణమనాయుడు తన కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. తన చెల్లెలు బాలను, నాని చంపాలని చూస్తున్న అచ్చమాంబ తమ్ముడిని చితక బాదేస్తాడు కృష్ణమనాయుడు. అచ్చమాంబ మనుషులందరినీ చిత్తు చేసి ఆమెను ప్రాణాలతో వదిలేసి వెళతాడు. కన్నవారి సమక్షంలో కోరుకున్నవారితో కళ్యాణం జరగడంతో అందరికీ ఆనందం పంచుతూ కథ ముగుస్తుంది.
‘ఒక్కసారి ప్రేమించి చూడండి’ అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ‘లాహిరి లాహిరి లాహిరిలో…’ చిత్రంలో నందమూరి హరికృష్ణ – భానుప్రియ, సుమన్ – రచన, వినీత్- సంఘవి జంటలుగా నటించారు. నానిగా ఆదిత్య ఓమ్, బాలగా అంకిత కనిపించారు. మిగిలిన పాత్రల్లో కె.విశ్వనాథ్, లక్ష్మి, చక్రవర్తి, కాంతారావు, సత్యప్రియ, జయప్రకాశ్ రెడ్డి, రంగనాథ్, రమాప్రభ, అచ్యుత్, కల్పన వేణుమాధవ్, చిత్రం శ్రీను, గోకిన రామారావు, జి.వి.సుధాకర్ నాయుడు అభినయించారు. ఈ చిత్రానికి కథావిస్తరణ దీన్ రాజ్, కథాసహకారం వేద్ కిరణ్, మాటలు చింతపల్లి రమణ అందించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కొమ్మినేని వెంకటేశ్వరరావు వ్యవహరించారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం నిర్వహిస్తూ వైవియస్ చౌదరి నిర్మించారు. కీరవాణి సంగీతం సమకూర్చారు. ఆయన బాణీలకు సీతారామశాస్త్రి పాటలు పలికించారు. ఇందులోని “వీరవేంకట…”, “లాహిరి లాహిరి లాహిరిలో…”, “కళ్ళలోకి కళ్ళు పెట్టి…”, “నేస్తమా…”, “మంత్రమేదో…”, “ఓహోహో చిలకమ్మా…”, “కిల్మిరే…” వంటి పాటలు ఆకట్టుకున్నాయి.
‘లాహిరి లాహిరి లాహిరిలో…’ చిత్రం మంచి విజయం సాధించింది.
35 కేంద్రాలలో వందరోజులు ప్రదర్శితం కాగా, అందులో 29 సెంటర్స్ లో డైరెక్ట్ గా శతదినోత్సవం చూడడం విశేషం! ఇక విజయవాడ – శకుంతలలో డైరెక్ట్ జూబ్లీ నడవడమూ మరో విశేషం. దాంతో తెలుగు చిత్రసీమలో ఒకే నటవంశానికి చెందిన నలుగురు హీరోలకు డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ దక్కడం అన్నది ఓ రికార్డుగా నిలచింది. ఆ రికార్డు నందమూరి నటవంశానికే చెందడం మరింత విశేషం! ఈ సినిమా శతదినోత్సవాన్ని వైవియస్ చౌదరి తన స్వస్థలమైన గుడివాడలో అంగరంగవైభవంగా జరిపారు. ఈ చిత్రం ద్వారా నందమూరి హరికృష్ణకు ఉత్తమ గుణచిత్ర నటునిగా, భానుప్రియకు ఉత్తమ సహాయనటిగా, రమాప్రభకు ఉత్తమ హాస్యనటిగా నంది అవార్డులు లభించాయి.