లారెన్స్ బిష్ణోయ్ ‘‘దేశద్రోహి’’.. గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా సంచలన వ్యాఖ్యలు..
ఇద్దరు గ్యాంగ్స్టర్స్, రెండు గ్యాంగుల మధ్య వార్ ఇప్పుడు సంచలనంగా మారింది. గ్యాంగ్‌స్టర్ రోహిత్ం గోదారా, మరో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని ‘‘దేశద్రోహి’’గా ఆరోపించాడు. బిష్ణోయ్ అమెరికా ఏజెన్సీతో కుమ్మక్కయ్యాడని, సున్నితమైన సమాచారాన్ని ఇస్తున్నట్లు వెల్లడించారు. ధ్రువీకరించని ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో గోదారా, బిష్ణోయ్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు. లారెన్స్ బిష్ణోయ్‌కి అమెరికాలోని ఓ సంస్థతో సంబంధం ఉందని ఆరోపించాడు. బిష్ణోయ్ తన సోదరుడు అన్మోల్ను కాపాడుకోవడానికి అమెరికన్ ఏజెన్సీతో చేతులు కలిపాడని, వారికి దేశం గురించి నిఘా సమాచారాన్ని అందిస్తున్నాడని చెప్పాడు. బిష్ణోయ్ కీర్తి పొందడానికి నటుడు సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేశాడని ఆరోపించాడు. తనను లేదా తన గ్యాంగ్‌ను లారెన్స్ బిష్ణోయ్‌తో లింక్ చేయవద్దని గోదారా మీడియాను కోరాడు.
33 ఏళ్ల కెరీర్లో గోల్డెన్ మైలురాయి.. జాతీయ అవార్డు అందుకున్న షారుఖ్ ఖాన్
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తన అభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మైలురాయిని ఎట్టకేలకు సాధించారు. తన “జవాన్” చిత్రానికిగాను 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఇది షారుఖ్ ఖాన్ తన 33 ఏళ్ల కెరీర్లో పొందిన మొదటి జాతీయ అవార్డు. ఇది అతడి సినీ ప్రయాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది. తాజాగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సేలు ఈ అవార్డు అందుకున్నారు. ఇద్దరు నటులు వెండి కమలం, సర్టిఫికెట్తో పాటు ఒక్కొక్కరు రూ.1 లక్ష నగదు బహుమతి అందుకున్నారు.
ఘనంగా నేషనల్ అవార్డుల ప్రదానోత్సవం..
2025 ’71 వ జాతీయ చలనచిత్ర అవార్డుల’ ప్రధానోత్సవ కార్యక్రమం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అట్టహాసంగా జరుగుతోంది. 2023కి గానూ కేంద్రం ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణులను ఇటీవల ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సౌత్, నార్త్ ఇండస్ట్రీస్ కి చెందిన అవార్డు విజేతలు ఈ వేడుకలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో 2025 సంవత్సరానికి సంబంధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన సినిమాలకు, నటీనటులకు జాతీయ పురస్కారాలు అందజేస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలకు అవార్డులు ప్రధానం చేస్తున్నారు. ఈ ఏడాది బాలీవుడ్ చిత్రం 1’2th’ ఉత్తమ జాతీయ చిత్రంగా ఎంపికైంది. ఇందులో హీరోగా నటించిన విక్రాంత్ మసాయ్ ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డులు గెలుచుకున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్ ‘ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కుష్బూ
బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో పార్టీ శ్రేణులు, ప్రజలు, సాంస్కృతిక ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వేడుకలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, తమిళ్నాడు బీజేపీ నేత, సినీ నటి కుష్బూ, మాజీ మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా రెడ్డి పాల్గొన్నారు. చార్మినార్ ప్రాంగణంలో పూలతో అలంకరించిన బతుకమ్మ ఆడిపాడారు. బతుకమ్మ పాటల కార్యక్రమాలు నిర్వహించారు. పాల్గొన్న మహిళలు, పిల్లలు సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ నృత్యం చేసి, పండుగ జరుపుకున్నారు. ఈ వేడుకల్లో కుష్బూ పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వరంగల్‌లో కొత్త CGHS వెల్నెస్ సెంటర్
వరంగల్‌లో కేంద్ర ప్రభుత్వం సైన్యాధారిత ఉద్యోగులు, పింఛన్ పొందే పౌరులకు మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడానికి కొత్త సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS) వెల్నెస్ సెంటర్ ని ఆమోదించింది. ఈ సౌకర్యం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు ఉపయోగపడనుంది. అయితే, సీజీఎచ్ఎస్ వెల్నెస్ సెంటర్లో ప్రాథమిక OPD చికిత్సలు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంటాయి. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం, ఉద్యోగుల సంక్షేమం, సామూహిక ఆరోగ్య పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను మళ్ళీ ప్రస్తావిస్తుంది. ఇది “సబ్కా సాత్, సబ్కా వికాస్” దార్శనికతకు సాక్ష్యంగా ఉంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్‌లో కొత్త వెల్నెస్ సెంటర్ ఆమోదం పొందిన విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు కిషన్ రెడ్డి. ఈ కొత్త సౌకర్యం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లు, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుండటం, ప్రాంతీయ ఆరోగ్య రంగానికి కీలక చొరవగా ఉంటుంది.
కోల్‌కత్తాలో వర్ష భీభత్సవం.. ఏడుగురు మృతి.. కదలని 30 విమానాలు
కోల్‌కత్తాను కుండపోత వర్షాలు ముంచెత్తాయి. వర్ష భీభత్సానికి కనీసం 30 విమానాలు ప్రయాణాలను రద్దు చేసుకున్నాయి అంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మరికొన్ని ఆలస్యం అయ్యాయని సమాచారం. ఈ భారీ వర్షం కారణంగా పలు ప్రమాదాలు కూడా సంభవించినట్లు నివేదికలు వస్తున్నాయి. కోల్‌కత్తాలో అనేక విద్యుత్ లైన్లు నీటిలో పడిపోవడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. అలాగే సుమారుగా ఏడుగురు విద్యుదాఘాతంతో మరణించారని అధికారులు పేర్కొన్నారు. నిరంతర వర్షం కారణంగా నగరం మొత్తం జలమయం కావడంతో పాటు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. వేలాది మంది ప్రయాణికులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఇప్పటివరకు కనీసం 30 విమానాలు రద్దు చేయగా, మరో 31 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని కోల్కత్తా విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. మరిన్ని విమాన ప్రయాణాలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని సమాచారం. రాబోయే రోజుల్లో కోల్‌కత్తాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిక జారీ చేసింది.
ఇక సెలవు.. లెజెండరీ అంపైర్ డిక్కీ బర్డ్ కన్నుమూత..
క్రికెట్ ప్రపంచం నుంచి ఓ దిగ్భ్రాంతికరమైన వార్త వెలువడింది. అద్భుతమైన నిర్ణయాలు, నిష్పాక్షిక అంపైరింగ్‌కు పేరుగాంచిన లెజెండరీ అంపైర్ డిక్కీ బర్డ్ 92 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఆయన క్రికెట్ చరిత్రకు అనేక చిరస్మరణీయ క్షణాలను అందించారు. డికీ బర్డ్ గతంలో మొదటి మూడు పురుషుల ఓడీఐ ప్రపంచ కప్ ఫైనల్స్‌కు అంపైరింగ్ చేశాడు. మొత్తంగా.. అతను 66 టెస్ట్ మ్యాచ్‌లు, 69 ఓడీఐలకు అంపైరింగ్ చేశాడు. అతని చివరి టెస్ట్ మ్యాచ్ 1996లో జరిగింది. ఈ మ్యాచ్ ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లోనే సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ తమ టెస్ట్ అరంగేట్రం చేశారు.
టీవీల నుంచి కార్ల వరకు తెగ కొనేస్తున్నారు.. జీఎస్టీ ఎఫెక్ట్‌తో ఆల్-టైం హై షాపింగ్..
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో, మార్కెట్లో కొనుగోళ్ల ప్రభావం కనిపిస్తోంది. పండగ సీజన్ కూడా కావడంతో మార్కెట్ లో సందడి నెలకొంది. సామాన్యుడికి అవసరమైన నిత్యావసరాలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, బైకులు, కార్లపై గతంలో 28 శాతం ఉన్న జీఎస్టీని కేంద్రం 18 శాతానికి తగ్గించింది. తగ్గించిన జీఎస్టీ సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చింది. దీంతో, తగ్గిన ధరల కారణంగా తమకు అవసరమయ్యే వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాటు నవరాత్రి, దీపావళి పండగకలు కూడా మార్కెట్‌కు ఊపునిచ్చింది. కొత్త పన్ను విధానంతో వినియోగదారులు కార్లు, బైకుల్ని కొనుగోలు చేస్తున్నారు. ఆటోమొబైల్ పరిశ్రమ ఎప్పుడూ లేని విధంగా కొనుగోళ్లను చూస్తోంది. 4 మీటర్ కార్లు 18 శాతం పన్ను స్లాబ్‌లోకి మార్చడంతో ధరలు తగ్గాయి. దీంతో దేశవ్యాప్తంగా షోరూంలలో సందడి నెలకొంది. మారుతి 80,000 ఎంక్వైరీలను, 30,000 డెలివరీలతో 35 ఏళ్లలో అత్యుత్తమ సింగిల్ డే పనితీరును నమోదు చేసింది. సాధారణ పండగ సీజన్లతో పోలిస్తే చిన్న కార్ల బుకింగ్స్ 50 శాతం పెరిగాయి.
బంగ్లాదేశ్‌లో ‘కమలం’ పంచాయతీ.. హీట్ పెంచిన పొలిటికల్ ఫైట్
బంగ్లాదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. దేశంలో 2026 ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెరిగింది. తాజాగా బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తు జాబితా నుంచి కమలం చిహ్నాన్ని తొలగించింది. ఈ నిర్ణయం బంగ్లాదేశ్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. నేషనల్ సిటిజన్స్ పార్టీ ఈ కమలం గుర్తును తమ పార్టీకి కేటాయించాలని ఎన్నికల సంఘంకి విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా ఈ నిర్ణయం వెలువడటం తీవ్ర చర్చకు దారి తీసింది. మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోయడంలో ఈ NCP కి చెందిన నాయకులు కీలకంగా వ్యవహరించారు. తాజా పరిణామాలతో దేశంలో పరిస్థితులు ఎలా మారనున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. భారతదేశం చొరవతో 1971లో స్వాతంత్ర్యం పొందిన బంగ్లాదేశ్‌లో చివరిసారిగా 2021లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో షేక్ హసీనా పార్టీ అఖండ విజయం సాధించింది. అయినప్పటికీ దేశంలో చెలరేగిన అల్లర్ల కారణంగా ఆమె ప్రభుత్వం కూలిపోయింది. తాజాగా 2026 ఫిబ్రవరిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలతో దేశంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది.
పిజ్జా ప్రియులకు షాక్.. ఇది చూస్తే జన్మలో పిజ్జా ముట్టరు..!
రోజు రోజుకు హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ ఉత్త మాటలుగా మారింది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పిజ్జా ప్రియులకు కొదువ లేదు. కానీ తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలతో పిజ్జా హౌస్‌లను షాక్ చేశారు. తెలంగాణలో 55 పిజ్జా సెంటర్లను.. అందులో పిజ్జాహట్, డోమినోస్, పిజ్జా ప్యారడైస్ స్టోర్ లను తనిఖీ చేశారు. ఈ తనిఖీలు వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో జరిగాయి. తనిఖీలలో ఏ చోటా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించబడడం లేదని తేలింది. కాలం ముగిసిన సాస్‌లు, ఎక్స్పైరీ డేట్ లేని సాస్‌లు వాడుతున్నట్లు, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని సిబ్బంది పిజ్జాలు, బర్గర్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మొలకెత్తిన బంగాళదుంపలతో క్రిమికీటకాల మధ్యే తయారీ జరుగుతుందని కూడా వెల్లడైంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు దీన్ని అత్యంత అసురక్షితంగా, గందరగోళంగా ఉందని పేర్కొన్నారు. కొందరు సిబ్బందిపై కేసులు నమోదు చేయబడ్డాయి, మరికొందరికి షోకాజు నోటీసులు జారీ అయ్యాయి.