‘కింగ్ ఖాన్’, ‘కింగ్ ఆఫ్ బాలీవుడ్’, ‘బాద్ షా ఆఫ్ బాలీవుడ్’ – ఇలా జేజేలు అందుకున్న షారుఖ్ ఖాన్ తో గత కొన్నేళ్ళుగా విజయం దోబూచులాడుతోంది. ఒకప్పుడు షారుఖ్ ఖాన్ సినిమా వస్తోందంటే చాలు అభిమానులు కళ్ళు ఇంతలు చేసుకొని కాచుకొని ఉండేవారు. షారుఖ్ సినిమా రిలీజయిన మొదటి రోజు మొదటి ఆట చూడకుంటే మనసు కుదుటపడని వారు అప్పట్లో ఎందరో ఉండేవారు. షారుఖ్ నటించిన ‘రొమాంటిక్ మూవీస్’ అనేకం బాక్సాఫీస్ బరిలో నిలచి, జనం మదిని గెలిచాయి. ప్రపంచంలోనే అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా షారుఖ్ ఖాన్ నటించిన ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’ నిలచింది. ఆ సినిమా విడుదలైన రోజుల్లో షారుఖ్ ఖాన్ చేయి తగిలితే చాలు అని ఎంతోమంది అభిమానులు ఆశించేవారు. ఇక అమ్మాయిల్లో రోజురోజుకూ క్రేజ్ పెంచుకుంటూ సాగారు షారుఖ్. అతని పేరు వింటే చాలు పూనకం వచ్చినట్టు ఊగిపోయిన వారెందరో ఉన్నారు. అంతటి ఫాలోయింగ్ ఉన్న షారుఖ్ ను పరాజయాలు పలకరించగానే, ఆ నాటి క్రేజు, మోజు అన్నీ కరిగిపోయాయి. ప్రస్తుతం సరైన సక్సెస్ కోసం షారుఖ్ ఖాన్ పట్టువీడని విక్రమార్కునిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
అభిమానులు ‘ఎస్.ఆర్.కె.’ అంటూ పిలుచుకొనే షారుఖ్ ఖాన్ 1965 నవంబర్ 2న ఢిల్లీలో జన్మించారు. షారుఖ్ తండ్రి మీర్ తాజ్ మొహమ్మద్ ఖాన్, ‘సరిహద్దు గాంధీ’గా పేరొందిన అబ్దుల్ గఫార్ ఖాన్ తో కలసి ‘అహింసా ఉద్యమం’లో చురుగ్గా పాల్గొన్నారు. దేశవిభజన తరువాత దేశరాజధానిలోనే షారుఖ్ తండ్రి మీర్ పలు వ్యాపారాలు చేశారు. ఢిల్లీలోని హన్స్ రాజ్ కాలేజ్ లో ఎకనామిక్స్ చదివారు షారుఖ్ ఖాన్. స్పోర్ట్స్ అంటే అతనికి ప్రాణం. స్పోర్ట్స్ మేన్ గానే సాగాలని ఆశించారు. అయితే డిగ్రీ చదివే రోజుల్లో ఎక్కువగా ‘థియేటర్ యాక్షన్ గ్రూప్’లో గడిపారు. అక్కడే బ్యారీ జాన్ దగ్గర నటనలో శిక్షణ పొందారు ఖాన్. అనేక టెలివిజన్ సీరియల్స్ లో షారుఖ్ నటించారు. అదే సమయంలో గౌరీతో ఆయనకు పరిచయం ఏర్పడి, ప్రణయంగా మారింది. తరువాత పరిణయమూ జరిగింది. గౌరీని పెళ్ళాడిన వేళావిశేషమేమో కానీ, షారుఖ్ కు తొలి సినిమా ‘దీవానా’తోనే నటునిగా మంచి గుర్తింపు లభించింది. దాంతో అవకాశాలూ పలకరించాయి. తరువాత షారుఖ్ నటించిన చిత్రాలు మోస్తరు విజయాలు సాధిస్తూ సాగాయి. ‘బాజీగర్’లో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో షారుఖ్ అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఆ సినిమా ఘనవిజయంతో షారుఖ్ స్టార్ హీరో అయిపోయారు. వరుసగా వచ్చిన “డర్, కభీ హా కభీ నా, అంజామ్, కరణ్ అర్జున్’ మంచి గుర్తింపు సంపాదించాయి. ఇక ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’తో బంపర్ హిట్ చూశారు షారుఖ్. ఆ సినిమా ఘనవిజయం తరువాత దేశవిదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నారు. మళ్ళీ ఆ స్థాయి హిట్ షారుఖ్ కు లభించలేదు. కానీ, ఆయన నటించిన “పర్దేశ్, దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, మొహబ్బతే, కభీ ఖుషి కభీ ఘమ్, దేవదాస్, మై హూ నా, వీర్-ఝారా, డాన్, చక్ దే ఇండియా, ఓమ్ శాంతి ఓమ్, రబ్ నే బనాదీ జోడీ, మై నేమ్ ఈజ్ ఖాన్, డాన్-2, చెన్నైఎక్స్ ప్రెస్” వంటి చిత్రాలు జనాన్ని భలేగా అలరించాయి. ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ తరువాత ఆ రేంజ్ సక్సెస్ మళ్ళీ షారుఖ్ ను పలకరించలేదు. ఆ పై వచ్చిన షారుఖ్ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్నే చవిచూశాయి. ప్రస్తుతం మూడు చిత్రాలలో షారుఖ్ నటిస్తున్నారు. ఆ సినిమాలతోనైనా తమ హీరో మళ్ళీ అలరిస్తాడనే ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.
నటునిగా షారుఖ్ ఖాన్ కీర్తి కిరీటంలో పలు అవార్డులూ రివార్డులూ ఉన్నాయి. 2005లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారాయన. ఫ్రెంచ్ ప్రభుత్వం ‘ఆర్డ్రే డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్, లెజియన్ డీఆనర్’ అవార్డులతో షారుఖ్ ను సన్మానించింది.
షారుఖ్ ఖాన్ తన కెరీర్ ను చక్కదిద్దుకోవడంలో బిజీబిజీగా ఉంటే, ఆయన తనయుడు ఆర్యన్ ఈ మధ్యే డ్రగ్స్ కేసులో ఊచలు లెక్కపెట్టి వచ్చాడు. తనయుడిని సక్రమ మార్గంలో నడిపేందుకు తపిస్తున్నారు షారుఖ్. త్వరలోనే ఎప్పటిలా ఆయన షూటింగ్స్ లో పాల్గొంటారని వినిపిస్తోంది. అలాగే ఆర్యన్ ను హీరోగా తీర్చిదిద్దే ప్రయత్నమూ మొదలెడతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.