ఆచార్య సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూ ఉంది. రామ్ చరణ్, చిరు కలిసి నటించిన ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడంతో… ఆ తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర డిజప్పాయింట్ చేయడంతో చిరుపై విమర్శలు మొదలయ్యాయి. ఆకాశాన్ని అందుకోవడానికి భూమి ప్రయత్నించినట్లు… ఆయన స్థాయి ఏంటో తెలియని వాళ్లు, అనే స్థాయి లేని వాళ్లు చిరుని విమర్శించడం మొదలుపెట్టారు. ఈ కామెంట్స్ ని వాల్తేరు వీరయ్య సినిమాతో సైలెంట్ చేసాడు చిరు కానీ ఇటీవలే వచ్చిన భోళా శంకర్ సినిమా మళ్లీ ఫ్లాప్ అయ్యి, అనడానికి అందరికీ అవకాశం ఇచ్చింది. ఈ విమర్శలు చిరు హిట్ కొట్టినప్పుడు ఆగుతాయి ఫ్లాప్ కొట్టినప్పుడు మళ్లీ మొదలవుతాయి కానీ ఎండ్ కార్డ్ అనేది ఉండదు.
చిరుని విమర్శించే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం 156 సినిమాలు చేసి డెమీగాడ్ గా పేరు తెచ్చుకున్న చిరంజీవి, మూడున్నర దశాబ్దాలుగా టాలీవుడ్ టాప్ చైర్ లో కూర్చున్న హీరోకి హిట్ ఫ్లాప్ అనే తేడా ఉంటుందా? అయినా ఈరోజు బుక్ మై షోలో చెమట పట్టకుండా టికెట్స్ బుక్ చేసుకోని, మల్టీప్లెక్స్ లో సినిమాలు చేసి కామెంట్స్ చేసే వాళ్లకి ఏం తెలుసు మెగాస్టార్ రేంజ్ ఏంటో… టికెట్ కోసం క్యూలో నిలబడి అలసిన కాళ్లకి, కౌంటర్ దగ్గర నలిగిన చేతికి, తోపులాటులో చిరిగిన చొక్కాకి తెలుసు ఆయన రేంజ్ ఏంటో. ఒక సినిమా చూడాలి అంటే ఎంత కష్టపడాలో… ఆ కష్టాన్నంతా ఒక్క ఇంట్రడక్షన్ సీన్ తో తీసేయగల చార్మింగ్ ఉన్న స్టార్ చిరు మాత్రమే. ఆయన కలెక్షన్ల రేంజ్ ఏంటో ఈరోజు మాట్లాడుకోవడం ఏంటి… టికెట్ కౌంటర్ దగ్గర ఊడిపడిన చొక్కా బొత్తాలు చెప్తాయి మెగాస్టార్ సినిమా కలెక్షన్స్ ఎంతో. 30-60 ఏళ్ల వయసున్న వాళ్లు ప్రతి ఇంట్లో ఉంటారు, వాళ్లని అడిగితే ఆపకుండా కథలు కథలుగా చెప్తారు మెగాస్టార్ అంటే ఏంటో. రేపు తన నెక్స్ట్ సినిమాతో కూడా చిరు హిట్ కొట్టొచ్చు కొట్టకపోవచ్చు కానీ ఆయన స్థాయి మారదు, ఆయనపై అభిమానుల ప్రేమ మారదు, ఆయన నుంచి మెగాస్టార్ అనే పిలుపు పోదు. దట్ ఈజ్ మెగాస్టార్, ది బిగ్గెర్ దేన్ బచ్చన్ స్టార్.