Masooda: ”మల్లేశం, పలాస, జార్జిరెడ్డి” చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు తిరువీర్. అతను కీలక పాత్ర పోషించిన ‘మసూద’ చిత్రం ఈ నెల 18 విడుదలై విజయపథంలో సాగుతోంది. ఈ సందర్భంగా తన కెరీర్, తన క్యారెక్టర్ గురించి మీడియాతో తిరువీర్ ముచ్చటించాడు. ఈ సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చిందో చెబుతూ, ”’పరేషాన్’ అనే సినిమా చేస్తున్న సమయంలో ‘మసూద’ గురించి సినిమాటోగ్రఫర్ జగదీష్ చీకటి ద్వారా నాకు తెలిసింది. స్వధర్మ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ కాబట్టి కథ కూడా వినకుండా ఓకే చెబుదామని అనుకున్నాను. ఆడిషన్ కోసం ఓ సీన్ చేశాం. అందులో ఇంగ్లీష్ డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. ఐదారు టేక్స్ తీసుకున్నాను. ఇక సినిమా ఆఫర్ రాదని భావించాను. కానీ చివరకు దర్శక నిర్మాతలకు నచ్చింది. ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చారు” అని అన్నారు. తన గత చిత్రాలకు భిన్నమైన పాత్ర చేయడం హ్యాపీగా ఉందని చెబుతూ, ”ఒకే రకమైన పాత్రలు చేయడం నాకు బాధగా అనిపించేది. ఎక్కువగా విలన్, సైకో పాత్రలే వచ్చేవి. ఇలాంటి కారెక్టర్లే నేను చేస్తానా? వాటికే సూట్ అవుతానా? అనే భావన నాలో కలుగుతుండేది. ఈ ఇమేజ్ చట్రం నుండి బయటకు రావాలి, వెరైటీ పాత్రలు చేయాలనుకునేవాడిని. పైకి చెప్పకపోయినా కూడా అందరికీ హీరో అవ్వాలనే కాదా ఉంటుంది. అది ‘మసూద’తో నెరవేరింది. ఈ సినిమా ఎక్స్ పీరియన్స్ చాలా గొప్పగా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి నటీనటులను చూడటం ఇష్టం. షూటింగ్స్ జరిగే సమయంలో ‘శుభలేఖ’ సుధాకర్, సంగీత, ‘సత్యం’ రాజేష్ ఇలా అందరిని చూసి ఆనందపడేవాడిని. వారితో కలిసి పని చేయడం సంతోషంగా అనిపించేది. చిత్రం ఏమంటే… నేను నా జీవితంలోనూ ఇందులోని ‘గోపీ’లానే ఉంటాను. అందువల్ల ఈ పాత్రను పోషించడం పెద్ద కష్టంగా అనిపించలేదు. మిగతా సినిమాల్లో చేసిన కారెక్టర్లే కష్టంగా అనిపించాయి. అయితే క్లైమాక్స్‌లో చేసిన స్టంట్స్ కాస్త కష్టంగా అనిపించాయి” అని తెలిపారు.
ఈ సినిమాతో తనకు మరింత గుర్తింపు లభించిందంటూ, ”నేను చేసిన చిత్రాలన్నీ అవార్డ్ విన్నింగ్ అండ్ క్రిటిక్స్ మెచ్చినవే. ‘మసూద’ లోని గోపి పాత్ర వల్ల కామన్ ఆడియెన్ కు చేరాను. నన్ను జనం గుర్తు పడుతున్నారు. సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెడుతున్నారు. ఈ సినిమాతో నాలోని ఇంకో కోణం కూడా అందరికీ తెలిసింది. నెగెటివ్ మాత్రమే కాదు ఇలాంటి పాత్రలు కూడా పోషించగలడని అంతా నమ్ముతున్నారు. ‘దిల్’ రాజు గారికి నా పాత్ర చాలా నచ్చింది. ఒకప్పుడు నేను ఎక్కువగా మీమ్స్ వేసేవాడిని. కానీ ఇప్పుడు నా మీద మీమ్స్ వేస్తున్నారు. గోపీ పాత్రతో జనాలు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు” అని అన్నారు. తన పేరు వెనుక కథ గురించి చెబుతూ, ”నా పేరు తిరుపతి రెడ్డి. నేను గురువుగా భావించే రఘువీర్ నుంచి వీర్ అని తీసుకుని ‘తిరువీర్’ అని పెట్టుకున్నా. అయితే వీర్ అనేదానికి మరో సెంటిమెంట్ కూడా యాడ్ అయింది. వీరమ్మ అనేది మా అమ్మ పేరు. అమ్మ, గురువు నుంచి తీసుకోవడంతో ‘తిరువీర్’ అనేది నాకు రెండు రకాలుగా సెంటిమెంట్ అయింది” అని చెప్పారు. ప్రస్తుతం పరేషాన్ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉందని, ‘మోక్షపటం’, ‘పారాహుషార్’ అనే సినిమాలూ చేస్తున్నానని, వైజయంతీ మూవీస్‌లో ఓ వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్నానని తిరువీర్ తెలిపారు. అలానే మరో మూడు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ కూ కమిట్ అయినట్టు చెప్పారు. రెమ్యూనరేషన్ కోసం కాకుండా కథ నచ్చితేనే సినిమాలు చేయాలన్నది తన పాలసీ అని అన్నారు.