మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణల మధ్య మూడు దశాబ్దాలుగా బాక్సాఫీస్ వార్ జరుగుతూనే ఉంది. సినిమాల పరంగా ప్రత్యర్దులుగా ఉన్న చిరు బాలయ్యలు బయట మంచి స్నేహితులుగానే కనిపిస్తారు. కలిసి కనిపించడం అరుదే కానీ కలిసినప్పుడు మాత్రం ఫ్రెండ్లీగా ఉంటారు. చిరు పెద్ద కూతురి పెళ్లిలో బాలయ్య చేసిన డాన్స్, బాలయ్య వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణీ ఓపెనింగ్ కి చీఫ్ గెస్ట్ గా చిరు రావడం లాంటి సందర్భాలని మెగా నందమూరి అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. టాలీవుడ్ కి పిల్లర్స్ లాంటి చిరంజీవిని బాలకృష్ణని ఒకే వేదికపై చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఇద్దరు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు సంక్రాంతి సీజన్ లోనే ప్రేక్షకుల ముందుకి రానున్నాయి.
వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలని మైత్రి మూవీ మేకర్స్ సమానంగా ప్రమోట్ చేస్తోంది. ఈ ప్రమోషన్స్ పీక్ స్టేజ్ కి వెళ్లాలి అంటే చిరు బాలయ్యలని కలపల్సిందే. ఈ అపూర్వ కలయికకి సరైన వేదిక ‘అన్ స్టాపపబుల్’ టాక్ షో. ‘ఆహా’లో బాలయ్య చేస్తున్న ‘అన్ స్టాపపబుల్’ టాక్ షో సీజన్ 2 ఇటివలే మొదలై గ్రాండ్ సక్సస్ అయ్యింది. ఈ టాక్ షోకి చిరంజీవిని ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప్రమోషన్ కోసం కూర్చోబెట్టగలిగితే బాగుంటుంది. చిరు బాలకృష్ణలు ఎదురెదురు కూర్చోని తమ సినిమాల గురించి మాట్లాడుకుంటే, ఆ సినిమాలకి అంతకన్నా పెద్ద ప్రమోషన్ ఏముంటుంది. ఈ పాయింట్ ని అలోచించి మేకర్స్ ‘అన్ స్టాపపబుల్’ షోలో చిరు బాలయ్యలని కలిపే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి కనిపించడానికి ఇంత కన్నా మంచి సమయం ఇంకొకటి రాదు.