కోట్లాదిమంది తెలుగు సినీ ప్రేక్షఖులు, ఆమాట కోసం భారతీయ సినీ అభిమానులు ‘డార్లింగ్’ అని ప్రేమగా పిలుచుకునే వ్యక్తి ప్రభాస్. సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ఇదే రోజున తొలిసారి అతను తన తొలి చిత్రం ‘ఈశ్వర్’ కోసం కెమెరా ముందుకొచ్చాడు. 2002 జూలై 28న రామానాయుడు స్టూడియోస్ లో ప్రభాస్ హీరోగా ‘ఈశ్వర్’ మూవీ మొదలైంది. పెదనాన్న, రెబెల్ స్టార్ కృష్ణంరాజు క్లాప్ కొట్టి ‘సూపర్ స్టార్ గా ఎదగమ’ని దీవించారు. అయితే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతాడని అప్పుడు ఆయనా ఊహించలేదు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండి హీరోగా పరిచయం అవ్వడం అన్నది మొదటి సినిమా వరకే ఉపయోగపడుతుంది, కానీ ఆ తరువాత సినిమాలతో హీరోగా సత్తా చాటి పోటీకి తట్టుకుని ఎదగడం అన్నది వాళ్ళ వాళ్ళ ఓన్ టాలెంట్ పై ఆధారపడి ఉంటుంది. అలా భిన్నమైన సినిమాలతో మాస్ ఇమేజ్ అందుకున్న ప్రభాస్ ఒక్కో సినిమాతో ఎదుగుతూ ఈ రోజు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
ప్రభాస్ ను హీరోగా నిలబెట్టిన ‘ఈశ్వర్’..
ప్రభాస్ హీరోగా అడుగుపెట్టి నేటికీ 20 ఏళ్ళు పూర్తవడంతో అయన అభిమానులు ఈ ఇరవై ఏళ్ల ఆనందాన్ని సంబరంగా జరుపుకున్నారు. ఆలిండియా రెబెల్ స్టార్ కృష్ణంరాజు, ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షడు జె ఎస్ ఆర్ శాస్త్రి (గుంటూరు) ఆధ్వర్యంలో మంగళవారం హైద్రాబాద్ లో కృష్ణంరాజు ఇంట్లో ఈ సెలెబ్రేషన్స్ జరిగాయి. కొద్ది మంది అభిమానులతో పాటు ‘ఈశ్వర్’ సినిమాను తెరకెక్కించి, ప్రభాస్ ని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు జయంత్ సి. పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్ తో పాటు కృష్ణంరాజు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసిన అనంతరం కృష్ణంరాజు మాట్లాడుతూ, ”ప్రభాస్ హీరోగా పరిచయమై అప్పుడే 20 ఏళ్ళు గడచిపోయాయా అనిపిస్తోంది. మా గోపీకృష్ణ బ్యానర్ లోనే అతన్ని హీరోగా పరిచయం చేద్దామని ముందు అనుకున్నాం. అయితే ఆ తర్వాత ఒకరోజు నిర్మాత అశోక్ కుమార్, దర్శకుడు జయంత్ వచ్చి ప్రభాస్ ని పరిచయం చేసే అవకాశం తమకు ఇవ్వమని అడిగారు. ‘ఈశ్వర్’ కథ బాగా నచ్చింది. మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయని” అన్నారు.
అశోక్ కుమార్ తనయుడు బదులు హీరోగా ప్రభాస్!
దర్శకుడు జయంత్ సి పరాన్జీ మాట్లాడుతూ, ”నేను పరిచయం చేసిన హీరో ఈ రోజు ఒక పాన్ ఇండియా స్టార్ గా అవుతాడని ఎప్పుడు అనుకోలేదు. ప్రభాస్ నిజంగా గొప్ప వ్యక్తి . ఈ మధ్య కూడా తనను కలిశాను. ‘ఈశ్వర్’ టైమ్ లో ఎలా ఉండేవాడో అదే అభిమానాన్ని కలిగి ఉన్నాడు. అంత పెద్ద హీరో అన్న గర్వం ఏ కోశానా లేదు. నిజంగా నా హీరో ఈ రేంజ్ కి వెళ్లడం మరచిపోలేని అనుభూతి. ఇక ‘ఈశ్వర్’ సమయంలో ప్రభాస్ తో గడిపిన రోజులు మరచిపోలేం. ఈ సినిమా సమయంలో కథ అనుకున్న తరువాత చాలా మంది హీరోలను పరిశీలించాను, అయితే ఓ కాఫీ షాప్ లో ప్రభాస్ ని చూసి ఈ అబ్బాయి బాగా ఉన్నాడు. మన కథకు సరిపోతాడని చెప్పగానే అశోక్ వెళ్లి కృష్ణంరాజును కలవడం ఆయన మమ్మల్ని నమ్మి హీరోని ఇవ్వడం నిజంగా గొప్ప విషయం. మాకు సపోర్ట్ చేసిన కృష్ణంరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు” అని అన్నారు.
నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ, ”’ఈశ్వర్’ సినిమా కథ తయారయ్యాక మా అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలని అనుకున్నాను. కానీ అపుడు మా అబ్బాయి ఇంకా చదువుకుంటున్నాడు.. అప్పుడే సినిమాల్లోకి లాగడం కరెక్ట్ కాదేమో అనిపించి మరో హీరో కోసం చూసాం. చాలా మందిని పరిశీలించాక ప్రభాస్ నచ్చడంతో కృష్ణంరాజు గారిని కలవడం ఆయన ఓకే అనడంతో ‘ఈశ్వర్’ తెరకెక్కింది. ప్రభాస్ ప్రవర్తనలో అప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పు లేదు. అంత పెద్ద హీరో అయినా కూడా అందరితో కలివిడిగా ఉంటారు. సినిమా సినిమాతో ఎదుగుతున్న మా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు.
‘ఈశ్వర్’ ఓపెనింగ్ కు ట్రాఫిక్ జామ్!
కృష్ణంరాజు భార్య శ్యామల ‘ఈశ్వర్’ ప్రారంభోత్సవాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ”ప్రభాస్ ని హీరోగా పరిచయం చేస్తూ ‘ఈశ్వర్’ షూటింగ్ మొదలు పెట్టిన రోజున రామానాయుడు స్టూడియోస్ వెళ్ళే రోడ్లన్నీ ట్రాఫిక్ తో నిండిపోయాయి. మేం స్టూడియోకి బయలు దేరి కూడా ట్రాఫిక్ లో చిక్కుకుని వెనక్కి వెళ్లిపోయాం. అంతమంది అభిమానులు వచ్చారు. వాళ్ళ ఆశీర్వాదంతోనే ప్రభాస్ నేడు పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం చాలా ఆనందంగా ఉంది. ప్రభాస్ కు నేనే పెద్ద అభిమానిని, ఈ విషయం తనతో చెబితే అవును అంటాడు. హీరోగా అంత పెద్ద స్టార్ ఇమేజ్ వచ్చినా కూడా అందరితో చాలా చక్కగా ఉంటాడు. నిజంగా ప్రభాస్ ని చూస్తుంటే పెద్దమ్మ గా చాలా గర్వంగా ఉంది” అని అన్నారు.
ఆలిండియా రెబల్ స్టార్ కృష్ణంరాజు, ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షుడు జె ఎస్ ఆర్ శాస్త్రి మాట్లాడుతూ, ”ప్రభాస్ ని హీరోగా పరిచయం చేయాలని వైజాగ్ లో సత్యానంద్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ ఇప్పించారు. అప్పుడు ప్రభాస్ ఎలా యాక్టింగ్ చేస్తున్నాడో తెలుసుకోమని సూర్యనారాయణ రాజు గారు నన్ను వైజాగ్ ఇనిస్టిట్యూట్ కి పంపించారు. నాపై అంత నమ్మకం ఉంది వాళ్లకు. ప్రభాస్ నటుడిగా కెరీర్ మొదలుపెట్టి ఇరవై ఏళ్ళు పూర్తయిన సందర్బంగా ఆయనకు మా అభిమానుల తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ వేడుకను చాలా మంది అభిమానుల సమక్షంలో జరపాలని అనుకున్నాం కోవిడ్ సమస్య వల్ల కుదరలేదు” అని తెలిపారు.