తెలుగు ఇండియన్ ఐడిల్ 24వ ఎపిసోడ్ ను లెజెండరీ లిరిసిస్ట్స్ వేటూరి, సీతారామశాస్త్రి పాటలతో నిర్వహించారు. మరో ఐదు రోజుల్లో (మే 20) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి జయంతోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఆహా ఆయనకు ఇచ్చిన ఘన నివాళిగా దీన్ని భావించొచ్చు. ఈ ఎపిసోడ్ లో సీతారామశాస్త్రి ప్రియ శిష్యుడు రామజోగయ్య శాస్త్రి పాల్గొనడం అందరికీ ఆనందాన్ని కలిగించింది. చిత్రం ఏమంటే… ప్రముఖ నేపథ్య గాయని శ్రావణ భార్గవి 23వ ఎపిసోడ్ ను శ్రీరామచంద్రతో కలిసి హోస్ట్ చేసింది. ఈ ఎపిసోడ్ ను మాత్రం ఆమె ఒక్కత్తే భుజానకెత్తుకుని నిర్వహించింది. మొదట అదితి భావరాజు ‘క్షణక్షణం’ మూవీలోని ‘జామురాతిరి జాబిలమ్మ’ గీతాన్ని అద్బుతంగా ఆలపించి, బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ అనిపించుకుంది. ఈ సందర్భంగా సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని రా. జో. శాస్త్రి గుర్తు చేసుకున్నారు. సీతారామశాస్త్రి కారణంగా తెలుగుజాతికి గౌరవం లభించిందని అన్నారు. కీరవాణి కంపోజిషన్ లో తమందరికీ ఇది సూపర్ స్పెషల్ సాంగ్ అన్నారు తమన్. కీరవాణితో తనకున్న అనుబంధాన్ని కార్తీక్ తలుచుకున్నాడు. ఏ పాట రికార్డింగ్ అయినా 20, 25 నిమిషాల్లో కీరవాణి పూర్తి చేస్తారని, ‘బాహుబలి’లోని ‘పచ్చబొట్టు…’ సాంగ్ రికార్డింగ్ కూడా అలానే జరిగిందని కార్తీక్ చెప్పాడు. ఆ తర్వాత రేణు కుమార్ ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’లోని వేటూరి గీతం ‘అది నన్నే నన్నే చేరి వచ్చే చంచల’ను పాడాడు. హ్యారీస్ జైరాజ్ స్వరకల్పనలో ఆ పాటను కార్తీక్ పాడటం విశేషం. ఆ రికార్డింగ్ విశేషాలు కార్తీక్ కంటెస్టెంట్స్ తో పంచుకున్నాడు. అంతేకాదు. రేణు కుమార్ కోరిక మేరకు వేదిక పైకి వచ్చి ఆ పాటను కొంత పాడి, స్టెప్పులూ వేశాడు. తమన్ డ్రమ్స్ వాయించి అందరిలో జోష్ నింపాడు.
ఈ ఎపిసోడ్ లో మూడో కంటెస్టెంట్ గా వచ్చిన ప్రణతి ‘సిరివెన్నెల’ సినిమాలోని ‘విధాత తలపున ప్రభవించినది’ గీతాన్ని పాడింది. ఆమెది బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ అంటూ కితాబిచ్చారు న్యాయ నిర్ణేతలు. ఆర్కెస్ట్రా అదిరిపోయిందని, ముఖ్యంగా సాయి ఫ్లూట్ ను అద్భుతంగా వాయించాడని మెచ్చుకున్నారు. ఎవరినైనా చక్కగా ఇమిటేట్ చేసే లక్షణం కలిగిన ప్రణతి… కార్తీక్ ను అనుకరిస్తే, కార్తీక్ తమన్ ను అనుకరించి నవ్వుల పువ్వులు పూయించారు. ఎప్పుడూ రిజర్వ్డ్ గా ఉండే కార్తీక్ తెలుగు ఇండియన్ ఐడిల్ లో మాత్రం చాలా సరదాగా ఉంటున్నాడని తమన్ అన్నాడు. అందుకు కారకులైన ఆహా టీమ్ కు కార్తీక్ థ్యాంక్స్ చెప్పాడు. ఆ తర్వాత మారుతిని స్టేజ్ మీదకు పిలిచింది శ్రావణ భార్గవి. అతనికి ‘స్టాట్యూ స్టార్’ అనే బిరుదు ఇచ్చేసిందామె. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’లోని ‘ఆకాశం తాకేలా…’ గీతాన్ని ఆలపించాడు మారుతి. ఆ సమయంలో తాను ప్రోగ్రామర్ గా వర్క్ చేస్తుండేవాడినని, ఈ సినిమా తర్వాత దేవీశ్రీని అడిగి మరి అతని దగ్గర వర్క్ చేశానని తమన్ చెప్పాడు. తనకు దేవిశ్రీతో రెండు దశాబ్దాల అనుబంధం ఉందని, అతనే తమకు ఇన్ స్పిరేషన్ అని కార్తీక్ అన్నాడు. చివరగా లాలస ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’లోని వేటూరి గీతాన్ని పాడి ‘బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్’ అనిపించుకుంది. ట్యూన్ కు తగ్గట్టుగా పదాలను పొదగడంలో వేటూరి గ్రేట్ అని రామజోగయ్య శాస్త్రి అన్నారు. ఇళయరాజా స్వరపరిచిన పాటను ఈ వేదికపై తాను పాడాలన్నది యూ.ఎస్.లో ఉన్న తన తండ్రి కోరికని, ఈ పాటను ఆయనకు అంకితమిస్తున్నానని లాలస తెలిపింది. త్వరలో అమెరికాలో జరుగబోతున్న ఇళయరాజా మ్యూజిక్ కన్సర్ట్ కు ఆయన్ని తప్పకుండా ఆహ్వానిస్తామని కార్తీక్ చెప్పాడు. ఈ వారంలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ను ఒకరికి కాకుండా ముగ్గురికి అందచేశారు. అందులో విజేతలుగా వాగ్దేవి, ప్రణతి, అదితి నిలిచారు.
ఎలిమినేట్ అయిన మారుతి!
న్యాయనిర్ణేతల మార్కులు, ప్రజల ఓటింగ్ తో ఎప్పటిలానే ఈసారి ఈ షో నుండి ఒకరిని ఎలిమినేట్ చేశారు. అయితే కంటెస్టెంట్స్ అంచనా ప్రకారం ఆఖరి మూడు స్థానాల్లో ఎవరు ఉండే ఛాన్స్ ఉందనే విషయాన్ని సేకరించారు. ఆ రకంగా శ్రీనివాస్, అదితి భావరాజు, మారుతి నిలిచారు. కానీ జడ్జెస్ మార్కులు, ఓట్ల ప్రకారంగా రేణుకుమార్, మారుతి, శ్రీనివాస్ చివరి మూడు స్థానాల్లో ఉన్నారు. అందులోంచి మారుతిని ఎలిమినేట్ చేసినట్టు శ్రావణ భార్గవి ప్రకటించింది. తనకు తమన్, కార్తీక్, నిత్యామీనన్ నుండి లభించిన ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని మారుతి చెప్పాడు.