Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకమైన పరిచయ వాక్యాలు రాయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, హిందీలో సూర్య పేరు తెలియని వారుండరు. ఆయన ఎంత మంచి నటుడో అంటే ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. స్టార్ నటుడు కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయమైనా తనకంటూ ఒక స్టార్ డమ్ ను తెచ్చుకోవడానికి నఎంతో కష్టపడ్డాడు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం సూర్య సొంతం. ఆడంబరాలకు పోడు.. అనవసరంగా మాట్లాడడు అదే సూర్యను కొన్ని కోట్లమంది అభిమానులను తీసుకొచ్చి పెట్టింది. ఇక నేటితో సూర్య ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు పూర్తిచేసుకున్నాడు. ఈ 25 ఏళ్లలో సూర్యను మలుపుతిప్పిన సినిమాలు కొన్ని ఉండగా.. నిరాశ పర్చిన సినిమాలు మరికొన్ని ఉన్నాయి. హిట్లకు పొంగిపోకుండా ప్లాపులకు కుంగిపోకుండా సినిమా తప్ప మాకేమి తెలియదని మంచి కథలను ఎంచుకోని అభిమానులను అలరిస్తున్నాడు.
సూర్య అసలు పేరు శరవణన్ శివ కుమార్. చదువు పూర్తి అయ్యాక సినిమాలో నటించాలనే కోరికతో ఇండస్ట్రీలో అవకాశాల వేటలో పడ్డాడు. అయితే స్టార్ నటుడు కొడుకు అని చెప్తే నేపోటిజం అని అంటారని తాను ఎవరో చెప్పకుండా అవకాశాల కోసం తిరిగాడు. 1997 లో మణిరత్నం దర్శకత్వం వహించిన నేరుక్కు నేర్ చిత్రంతో సూర్య ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమాలో స్టార్ హీరో విజయ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. చిన్న చిన్న చింతలు చేస్తూ ఎదుగుతున్న సూర్యకు బ్రేక్ వచ్చింది అంటే.. నంద సినిమా వలన. దర్శకుడు బాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూర్యను హీరోగా నిలబెట్టింది. ఇక ఈ సినిమా తరువాత సూర్య వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒక పక్క హీరోగా చేస్తూనే మంచి సపోర్టింగ్ రోల్ వస్తే వదిలేవాడు కాదు సూర్య. అలా చేసిందే శివ పుత్రుడు. విక్రమ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సూర్యకు ఈ సినిమా అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఇక తరువాత హిట్లు ప్లాపులు అని లేకుండా వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు.
ఇక 2005 లో ఈ కోలీవుడ్ హీరో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. గజినీ.. అప్పట్లో ఈ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాతరువాత సూర్య నటించిన ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతూనే వచ్చాయి. దేవా, ఆరు, రక్త చరిత్ర, యముడు సిరీస్, 7th సెన్స్, 24 చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక కరోనా సమయంలో ఓటిటీ లో రిలీజైన ఆకాశం నీ హద్దు రా, జై భీమ్ చిత్రాలతో సూర్య మరో మెట్టు పైకి ఎదిగి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ రెండు సినిమాలు ఆస్కార్ కూడా నామినేట్ అవ్వడం విశేషం. ఈ 25 ఏళ్ల కెరీర్ లో సూర్య జీవితం ఎంతోమందికి ఆదర్శం. ఒక హీరోగానే కాకుండా ఒక మనిషిగా ఉండడానికే సూర్య ఇష్టపడుతుంటారు. అగారం ఫౌండేషన్ స్థాపించి ఎంతోమంది చిన్నపిల్లలకు చదువును అందిస్తున్నాడు. సూర్య ప్రస్థానం ఎప్పటికీ ముగియనిది. ఆయన ఇలాంటి సినిమాలు ఇంకా చేస్తూ 50 ఏళ్ళు, 100 ఏళ్లు పూర్తిచేసుకోవాలని అభిమానులు కోరుకొంటున్నారు. ఇక తన పాతికేళ్ల సినిమా కెరీర్ గురించి సూర్య చెప్పుకొచ్చాడు. మీరిచ్చిన ప్రేమ వలనే నేను ఇక్కడ ఉన్నాను.. మీ ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు.