‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్ అనగానే.. అనౌన్స్మెంట్ నుంచే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా పై అంచనాలు డబుల్ అయిపోయాయి. ఈసారి పవర్ స్టార్‌తో దర్శకుడు హరీశ్ శంకర్ ఎలా ఎంటర్టైన్ చేస్తాడా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హరీశ్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఉస్తాద్ భగత్ సింగ్‌ను తెరకెక్కిస్తున్నాడు. అయితే, లేటెస్ట్‌గా ఇందులో ఓ సీక్వెన్స్‌ను మాత్రం గబ్బర్ సింగ్‌కు మించి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ పవన్ రాజకీయంగా బిజీగా మారడంతో.. సినిమాల షూటింగ్ డిలే అవుతు వచ్చాయి. అయితే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్.. మరోపక్క తాను ఒప్పుకున్న సినిమాల షూటింగ్‌లు కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు.
Also Read: Peddi: ఫస్ట్ సింగిల్ రెడీ.. ఆరోజేనా!?
ఇటీవలె ‘హరిహర వీరమల్లు’ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో.. సెప్టెంబర్ 25న రానున్న సుజీత్ ‘ఓజీ’ పై భారీ ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసిన పవర్ స్టార్.. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక సాంగ్ షూటింగ్ చిత్రీకరణ జరుగుతోంది. అయితే, ఇక్కడ తెలిసిన మరో విషయం ఏంటంటే.. ఇది కేవలం సాంగ్ మాత్రమే కాదట. గబ్బర్ సింగ్ సినిమాలో విలన్ గ్యాంగ్‌తో కలిసి పవన్ చేసిన రచ్చ థియేటర్లు ఊగిపోయేలా చేసిన సంగతి తెలిసిందే. అంత్యాక్షరి పేరిట విలన్లతో పాటలు పాడించి, స్టెప్పులేయించి, వాళ్లతో కలిసి ఆయన కూడా స్టెప్పులేసి నానా రచ్చ చేశారు. ఇప్పుడు ఇలాంటి సీక్వెన్స్ ఉస్తాద్ భగత్ సింగ్‌లో షూటింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని, దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్‌కు పవన్ వేసే స్టెప్పులు మామూలుగా ఉండవని చిత్ర యూనిట్ సమాచారం. ఇక శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుందో చూడాలి.