Sumanath and Bhumika Chawla once again :
భూమికా చావ్లా నటించిన తొలి తెలుగు సినిమా ‘యువకుడు’. ఇది 2000 సంవత్సరంలో వచ్చింది. అంటే ఇప్పటికి 22 సంవత్సరాలైంది. ‘తొలిప్రేమ’ తర్వాత ఎ. కరుణాకరన్ దర్శకత్వం వహించిన’యువకుడు’ సినిమాతోనే భూమిక హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె తొలి చిత్ర కథానాయకుడిగా సుమంత్ నటించాడు. విశేషం ఏమంటే… ఇప్పుడు 22 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి మరోసారి ‘సీతారామం’ మూవీలో జంటగా నటిస్తున్నారు. ఆ తర్వాత నాగార్జున, సుమంత్ నటించిన ‘స్నేహమంటే ఇదేరా’లో భూమిక నటించినా, ఆమె నాగార్జున భార్య పాత్రను పోషించింది. సో… ఈ ఇరవై రెండు సంవత్సరాలలో సుమంత్, భూమిక లకు ఏ సినిమాలోనూ జోడీ కట్టే ఛాన్సే రాలేదు. కానీ ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తో హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘సీతారామం’ లో మరోసారి జంటగా నటించే అవకాశం కలిగింది. ఇందులో బ్రిగేడియర్ విష్ణు శర్మ గా సుమంత్ నటిస్తుంటే ఆయన భార్య మృణాళిని పాత్రను భూమిక చావ్లా పోషిస్తోంది. వరుసగా ‘సీతారామం’లోని పాత్రలను పరిచయం చేస్తూ వస్తున్న మేకర్స్ బుధవారం భూమిక ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సీనియర్ నిర్మాత అశ్వనీదత్ నిర్మిస్తున్న ‘సీతారామం’ మూవీ ఆగస్ట్ 5న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది.