జనానికి ‘జూనియర్ యన్టీఆర్’. అభిమానులకు ‘యంగ్ టైగర్’. సన్నిహితులకు ‘తారక్’… వెరసి ‘బుల్లి రామయ్య’ – అతనంటే తెలుగువారందరికీ అభిమానమే! నందమూరి నటవంశం మూడో తరం హీరోల్లో ఎందరున్నా, జూనియర్ యన్టీఆర్ దే పైచేయి. తాత తారకరాముని పేరు పెట్టుకొని, ఆ నామానికి ఉన్న గౌరవాన్ని నిలుపుతూ చిత్రసీమలో తనదైన బాణీ పలికిస్తున్నాడు తారక్. తండ్రి హరికృష్ణ పౌరుషాన్ని నింపుకొని అభిమానుల మదిలో యంగ్ టైగర్ గా నిలిచాడు. బాబాయ్ బాలకృష్ణ లాగే అభిమానగణాలను అలరిస్తూ సాగుతున్నాడు తారక్. నవతరం కథానాయకుల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ అశేష అభిమానుల మదిని గెలిచాడు యంగ్ టైగర్!
తాత నటరత్న యన్టీఆర్ 1923 మే 28న జన్మించారు. సరిగా అరవై ఏళ్ళకు ఓ ఎనిమిది రోజులు తక్కువలో 1983 మే 20న జూనియర్ యన్టీఆర్ పుట్టడం విశేషం! యన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరంలోనే ఈ బుల్లి రామయ్య జన్మించడం మరింత విశేషమే! పురాణ పాత్రపోషణలో నందమూరి వారిదే పైచేయి. అందులో ఎవరికీ ఎలాంటి సందేహమూ లేదు. ఈ బుల్లిరామయ్య సైతం పురాణ పాత్రతోనే తొలిసారి కెమెరా ముందుకు వచ్చాడు. తాత దర్శకత్వంలో హిందీ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో బాలభరతునిగా నటించిన తారక్, కొద్ది కాలానికే ‘రామాయణం’లో రామునిగా నటించి, తెలుగు తెరపై తొలిసారి వెలిగాడు. నటరత్న యన్టీఆర్ కు మాస్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన నటవారసునిగా బాలకృష్ణ నందమూరి నటనావైభవాన్ని ఇప్పటికీ జనానికి గుర్తు చేస్తూనే ఉన్నారు.
అదే పంథాలో పయనించడానికి ఆ ఇంట మూడోతరం పంటగా జూనియర్ యన్టీఆర్ బయలు దేరాడు. ఆరంభం నుంచీ మాస్ ను మెప్పించే పాత్రలతోనే పరవశింప చేస్తున్నాడు తారక్. చిత్రసీమలో ప్రవేశించక ముందు శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందిన తారక్ పదేళ్ళ ప్రాయంలోనే నాట్యంలో రికార్డు స్థాయి ప్రదర్శన ఇచ్చాడు. ఆ తరువాత నాట్యాభ్యాసాన్ని అంతగా పట్టించుకోని తారక్ ముద్దుగా బొద్దుగా తయారయ్యాడు. లావుంటేనేమీ మా బాగా ఉన్నాడంటూ జనం అభిమానించారు. “స్టూడెంట్ నంబర్ వన్”తో తొలి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న యన్టీఆర్ “ఆది”గా అదరహో అనిపించాడు. “సింహాద్రి”గా శివాలెత్తిపోయాడు. ఈ చిత్రాల తరువాత మాస్ లో తారక్ కు విశేషమైన ఫాలోయింగ్ నెలకొంది. తాత, బాబాయ్ లాగే అనేక రికార్డులను సొంతం చేసుకొని అభిమానగణాలకు ఆనందం పంచాడు తారక్.
ఆరంభంలో ముద్దుగా బొద్దుగా మురిపించిన తారక్, “యమదొంగ”లో నాజూగ్గా మారిపోయాడు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా పాత్రకు తగ్గట్టుగా శరీరసౌష్టవాన్ని మార్చుకుంటూ తడాఖా చూపిస్తున్నాడు తారక్. నందమూరి నటవంశానికి అభినయంతో పాటు వాచకం కూడా ఓ ప్రత్యేక ఆకర్షణ. “యమదొంగ”లో తనదైన వాచకంతో ఎదురుగా మోహన్ బాబు లాంటి వాచకాభినయంలో మేటి ఉన్నా, తగిన పోటీనిచ్చి తారక్ మెప్పించిన తీరును జనం మరచిపోలేరు. “టెంపర్” కోర్టు సీన్ లో తాత “బొబ్బిలిపులి”ని గుర్తుకు తెచ్చాడు ఈ బుల్లి రామయ్య. “అదుర్స్”లో ద్విపాత్రాభినయంలో యంగ్ టైగర్ చూపించిన వైవిధ్యాన్ని ఎవరు మాత్రం మరచిపోగలరు? మనసు బాగోకపోతే ఇప్పటికీ ఎందరో అభిమానులు ‘అదుర్స్’లోని చారి పాత్రలో జూనియర్ అభినయాన్ని చూసి మురిసిపోతుంటారు. ఇక ‘జై లవకుశ’లో తారక్ త్రిపాత్రాభినయం అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసింది.
తన దరికి చేరిన ప్రతీపాత్రకు న్యాయం చేయాలని తపించే యంగ్ టైగర్ డ్యాన్సుల్లోనూ భళా అనిపిస్తున్నాడు. తారక్ నటనతో పాటు, అతని నర్తనాన్నీ అభిమానించేవారెందరో చిత్రసీమలోనే ఉన్నారు. యన్టీఆర్ సమకాలికులు సైతం ఆయన నాట్యాన్ని అభిమానిస్తారంటే అతిశయోక్తి కాదు. తెలుగు చిత్రసీమలో ‘మల్టీస్టారర్స్’కు ఓ క్రేజ్ సంపాదించి పెట్టిన ఘనత యన్టీఆర్- ఏయన్నార్ కే దక్కుతుంది. వారి తరువాత కృష్ణ, శోభన్ బాబు సైతం అదే పంథాలో పయనించారు. 1985 తరువాత ఇప్పటి దాకా అసలు సిసలు మల్టీస్టారర్ వెలుగు చూడలేదు. కారణం ఒకే తరానికి చెందిన ఇద్దరు సమస్థాయి హీరోలు కలసి నటించక పోవడమే. ఆ లోటు తీరుస్తూ తారక్ తన మిత్రుడు రామ్ చరణ్ తో కలసి ‘ట్రిపుల్ ఆర్’లో నటించాడు. నవతరానికి అసలు సిసలు మల్టీస్టారర్ చూపించాడు. రాబోయే చిత్రాలతోనూ తారక్ తన ఫ్యాన్స్ ను మరింతగా మురిపిస్తాడని ఆశిద్దాం.