అందం, అభినయం కలబోసిన రూపం ఉన్నా ఎందుకనో రమాప్రభ నాయికగా రాణించలేక పోయారు. 1970ల ఆరంభంలోనే స్టార్ కమెడియన్ అనిపించుకున్నారు రమాప్రభ. అప్పట్లో ఎంతోమంది సినిమా ప్రయత్నాలు చేసేవారికి రమాప్రభ అండగా నిలిచారు. కొందరికి ఆర్థిక సాయం, మరికొందరికి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. ‘కన్నెవయసు’ చిత్రంలో హీరోగా నటించిన లక్ష్మీకాంత్ అప్పట్లో వర్ధమాన కథానాయకుడు. లక్ష్మీకాంత్ కు శరత్ బాబు ఫ్రెండ్. ఆ లక్ష్మీకాంత్ ద్వారా శరత్ బాబు రమాప్రభకు పరిచయం అయ్యారు. ఆ తరువాత శరత్ బాబు నటనలో రాణించడానికి పాట్లు పడుతున్న సమయంలో రమాప్రభ పలువురికి ఆయన గురించి రికమెండ్ చేశారు. అప్పట్లో వారిద్దరిపై కొన్ని పుకార్లు షికారు చేశాయి. దాంతో ఆ పుకార్లనే నిజం చేయాలని శరత్ బాబు కోరారు. అలా వారిద్దరూ భార్యాభర్తలుగా మారారు.
దాదాపు పదేళ్ళ పాటు రమాప్రభ, శరత్ బాబు సంసారనౌక సజావుగా సాగింది. వారిద్దరూ కలసి “గాంధీనగర్ రెండవ వీధి, అప్పుల అప్పారావు” చిత్రాలు నిర్మించారు. ఆ రెండు సినిమాలు రమాప్రభకు మంచిలాభాలు సంపాదించి పెట్టాయి. ఈ చిత్రాలలో హీరోగా నటించిన రాజేంద్రప్రసాద్ కు రమాప్రభ సమీపబంధువునే ఇచ్చిపెళ్ళి చేశారు. అప్పుడు రమాప్రభ, శరత్ బాబు పెళ్ళి పెద్దలుగానూ వ్యవహరించారు. అప్పట్లో శరత్ బాబు తాను మరచిపోలేని రోజులు మూడే – అంటూ ప్రకటించారు. ఒకటి తన పుట్టినరోజు, రెండు తన భార్య రమ పుట్టినరోజు, మూడు తమ పెళ్ళి రోజూ అంటూ ఓ సినిమా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అంతలా భార్యను ప్రేమించిన శరత్ బాబు, ఎందువల్లనో రమాప్రభను వదలివేయాలని భావించారు. వారిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగానే పొరపొచ్చాలు వచ్చాయని అంటారు. రమాప్రభకు తాను కోట్ల రూపాయల ఆస్తులు అప్పట్లోనే సంపాదించి ఇచ్చానని శరత్ బాబు చెప్పేవారు. అయితే తన ఆస్తులను మోసం చేసి రాయించుకున్నాడని రమాప్రభ అనేవారు. ఏది ఏమైనా రమాప్రభ, శరత్ బాబు విడాకుల గురించి, ఈ తరం కూడా తెలుసుకొనేందుకు సోషల్ మీడియాలో పుంఖాను పుంఖాలుగా కథలు కనిపిస్తూనే ఉన్నాయి.