తెలుగు చిత్రసీమ పాటలతోటలో ఎన్నెన్నో తేనెల వానలు కురిశాయి. అన్నీ తెలుగువారికి పరమానందం పంచాయి. ఈ తోటపై ‘సిరివెన్నెల’ కురిపించిన ఘనత మాత్రం సీతారామశాస్త్రిదే అని అందరూ అంగీకరిస్తారు. సీతారామశాస్త్రి పాటల్లోని పదబంధాలకు తెలుగు జనం ఆరంభంలోనే బందీలయిపోయారు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా వందల పాటల్లో సిరివెన్నెల కురుస్తూనే ఉంది. నింగిలోని చంద్రుడు కురిపించే వెన్నెల ప్రపంచానికంతా పరిచయమే, నేలపైని చెంబోలు సీతారాముడు కురిపించిన సిరివెన్నెల మాత్రం తెలుగువారికి మాత్రమే సొంతం. ఒకటా రెండా సీతారామశాస్త్రి పాటల సందడిలోకి ఓ సారి తొంగిచూశామో, ఆ పాటల మాధుర్యం తలపుల మునకలో అంత త్వరగా తెలవారదు.
చేంబోలు సీతారామశాస్త్రి 1955 మే 20న కన్ను తెరిచారు. బాల్యం నుంచీ సాహిత్యాభిలాషే! మదిని ఆకట్టుకొనే ప్రతీ అంశాన్నీ పాట రూపంలో మలిచేవారు. సీతారామశాస్త్రి గీతాల్లో ప్రబంధకవుల పంథా కనిపిస్తుంది. భక్తకవుల భక్తీ వినిపిస్తుంది. పదకవితల పరిమళమూ వీస్తుంది. శ్రీనాథుని శృంగారమూ ధ్వనిస్తుంది. వేమన వేదాంతమూ వినగలము. భావకవుల హృదయపు లోతులూ కనగలము. కాలానికి అనుగుణంగా సీతారాముని పాటల్లో అన్యదేశ్యాలూ అందంగానే అనిపిస్తాయి.
వస్తూనే “విధాత తలపున ప్రభవించిన అనాది జీవనవేదం…” వినిపించారు సీతారామశాస్త్రి, ఆ వేదనాదం మోదం పంచింది, ఎల్లరి ఆమోదం పొందింది. అప్పటి నుంచీ సీతారాముని పాట కోసం తెలుగు సినిమానే కాదు, ప్రేక్షకులూ ఎదురుచూశారు. ఆ ఎదురుచూపులకు తగ్గ పదబంధాలతో పరవశింప చేసి, ‘నంది’ వర్ధనాలు అందుకోవడంలో తనకు తానే సాటి అనిపించారు. సీతారామశాస్త్రి కంటే ముందు ఎందరో కవిపుంగవులు తెలుగుపాటకు జనం మదిలో పట్టం కట్టారు. వారి పాటకు ప్రభుత్వం పట్టం కట్టే సమయానికి కొందరి ఇంటనే ‘నంది’ వర్ధనాలు పూశాయి. సీతారాముని రాకతో వరుసగా మూడేళ్ళు ఆయన పలికించిన పాటలకు పులకించి, నంది నడచుకుంటూ వెళ్ళింది. ఇప్పటి దాకా ‘నంది’ అవార్డుల్లో ‘హ్యాట్రికానందం’ పొందిన ఘనత సిరివెన్నెలదే! సీతారాముడు ఏకాదశ రుద్రుల ప్రియభక్తుడు కాబోలు పదకొండు సార్లు ఆయన ఇంట నంది నాట్యం చేసింది. పండితపామర భేదం లేకుండా అందరినీ అలరిస్తూ సాగింది సీతారామశాస్త్రి కవనప్రయాణం.
“వేడుకకు వెలలేదు… వెన్నెలకు కొలలేదు…” అన్నట్టు సీతారాముని ‘సిరివెన్నెల’ను ఎంతగా తలచుకున్నా కొంతే అవుతుంది. తలచుకున్న ప్రతీసారి ఆనందం మన సొంతం కాక మానదు.