పెరుగుట విరుగుట కొరకే అంటూ ఉంటారు. అన్ని సందర్భాల్లో కాదు కానీ, కొన్ని విషయాల్లో ఇది నిజమవుతూ ఉంటుంది. స్ట్రీమింగ్ జెయింట్ అనిపించుకున్న నెట్ ఫ్లిక్స్ కు ఈ యేడాది తొలి క్వార్టర్ లోనే షాక్ తగిలినట్టయింది. ఎందుకంటే నెట్ ఫ్లిక్స్ లెక్కలు చూస్తే ఈ యేడాది మొదటి మూడు నెలల్లోనే లక్షలాది మంది సబ్ స్క్రైబర్స్ తగ్గినట్టు తేలింది. అయితే భారతదేశం, మరికొన్ని ఆసియా దేశాల్లో మాత్రం నెట్ ఫ్లిక్స్ దే హవా అని తెలుస్తోంది. ఆసియా-ఫసిఫిక్ రీజియన్ లో పది లక్షల సబ్ స్క్రైబర్స్ పెరిగారు. అయితే కెనడా, యు.ఎస్.లో మాత్రం 6,40,000 మంది తగ్గారు. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల్లో మొత్తం 3,00,000 మంది సబ్ స్క్రైబర్స్ తొలగిపోయారు. ఇక లాటిన్ అమెరికాలో అయితే 3.50.000 మంది జారుకున్నారు. ఇలా తరుగుతూ పోతే మరో మూడు నెలలకు దాదాపు 25 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ తగ్గే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
నిజానికి ఆరంభంలో అన్ని స్ట్రీమింగ్ స్టేషన్స్ కంటే నెట్ ఫ్లిక్స్ కు ఎక్కువ క్రేజ్ ఉండేది. అందుకు కారణం, భారీ చిత్రాలను భారీ వ్యయంతో కొనుగోలు చేసి, తన సబ్ స్క్రైబర్స్ ముందు ఉంచేది నెట్ ఫ్లిక్స్. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో నెట్ ఫ్లిక్స్ పోటీదారులు హాట్ స్టార్, అమేజాన్, హులు తమ సబ్ స్క్రిప్సన్ రేట్స్ ను తగ్గించారు. నెట్ ఫ్లిక్స్ ఓ నెలకు తీసుకొనే రుసుముతో తమ ఫ్లాట్ ఫామ్స్ లో ఏకంగా ఏడాదిపాటు చూడవచ్చునని సదరు సంస్థలు చాటింపు వేశాయి. అయినా, గత సంవత్సరం వరకు నెట్ ఫ్లిక్స్ కు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తరువాత నెట్ ఫ్లిక్స్ సైతం తమ రేట్లను కాసింత తగ్గించి, ప్రేక్షకులను ఆకట్టుకోవడం మొదలు పెట్టింది. కానీ, ఈ యేడాది మొదటి మూడు నెలల్లోనే సబ్ స్క్రైబర్స్ జారిపోవడం వింతగానే ఉందని సంస్థ సి.ఇ.ఓ. రీడ్ హాస్టింగ్స్ సైతం అంగీకరించారు. అంతే కాదు, ఉక్రెయిన్ పై రష్యా దాడిని నిరసిస్తూ నెట్ ఫ్లిక్స్ రష్యాలో తమ సేవలను నిలిపివేసింది. ఈ కారణంగానూ కొంత నష్టం వాటిల్లిన మాట వాస్తవమే!
నెట్ ఫ్లిక్స్ కారణంగా కలిగిన నష్ట నివారణకు ఇతర సంస్థలు తమ ఫ్లాట్ ఫామ్స్ లో ప్రకటనలను చొప్పించాయి. దాంతో వారికి నష్టం భర్తీ అవుతూ వస్తోంది. అదే పంథాలో నెట్ ఫ్లిక్స్ కూడా పయనించనుందని తెలుస్తోంది. “మొదటి నుంచీ నేను వినియోగదారుని సౌకర్యమే ప్రధానంగా భావించానని, అందువల్ల యూజర్ కు యాడ్స్ వలన అంతరాయం కలుగుతుందని ప్రకటనలకు తావివ్వలేదని” రీడ్ అంటున్నారు. కానీ, నష్టపరిష్కారానికి యాడ్స్ ను ఆశ్రయించడం మినహా వేరే దారి లేదనీ సంస్థ భావిస్తోంది. యాడ్ మార్కెట్ ప్రమోషన్స్ వల్ల, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు లాభం చేకూరే అవకాశం ఉందని తెలుస్తోంది ఇప్పటికే ఏలాంటి అంతరాయాలు లేకపోయినా, నెట్ ఫ్లిక్స్ వినియోగదారుల సంఖ్య తగ్గుతోంది. మరి ప్రకటనలు తోడయితే, సంస్థకు రాబడి పెరగవచ్చు కానీ, మరింత మంది సబ్ స్క్రైబర్స్ తొలగే ప్రమాదం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. మరి నెట్ ఫ్లిక్స్ ఏ తీరున ముందుకు సాగుతుందో, రాబోయే మూడు నెలల్లో ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి.