Senior Naresh Gives Health Update Of Superstar Krishna: సూపర్‌స్టార్ కృష్ణ అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన సంగతి తెలిసిందే! నిన్న అర్థరాత్రి గుండెపోటు రావడంతో, వెంటనే ఆయన్ను గబ్బిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. కృష్ణ ఆరోగ్యంపై తాజాగా ఆయన కుమారుడు నరేష్ స్పందించారు. నిన్నటి వరకు ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, ఆయన ఆరోగ్యం విషమంగానే ఉన్నప్పటికీ నిలకడగానే ఉన్నారని చెప్పారు. వ్యక్తిగత జీవితంలోనూ, కెరీర్ పరంగానూ తన తండ్రి ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని సూపర్‌స్టార్‌గా ఎదిగారని.. ఆయన ఓ ఫైటర్ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన శ్వాస తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. రేపు ఇంకా బాగుంటుందని తాను నమ్ముతున్నానన్నారు. ఆయన ఎప్పుడు ఆసుపత్రికి వచ్చినా.. నిలబడి నడుస్తారే తప్ప, వీల్ ఛైర్‌లో కూర్చోరన్నారు.
ఆసుపత్రి వాళ్లు ఎప్పటికప్పుడు కృష్ణ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ ఇస్తారని, రేపు కూడా అప్డేట్ ఇస్తారని నరేష్ స్పష్టం చేశారు. తాము చెప్పడం కన్నా, ఆసుపత్రి అప్డేట్స్ ఇంకా పర్ఫెక్ట్‌గా, సైంటిఫిక్‌గా వస్తుందన్నారు. మెడికేషన్ పెరగలేదని, ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించినప్పుడు ఏదైతే మెడికేషన్ ఇస్తున్నారో, ఇప్పటికీ అదే ఇస్తున్నారని తెలిపారు. వయసు మీద పడినప్పుడు సహజంగానే ఇలా అనారోగ్యానికి గురవుతుంటారని, తన తండ్రి కూడా ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చేందుకు పోరాడుతున్నారని నరేష్ వెల్లడించారు. రీల్ లైఫ్‌లో, రియల్ లైఫ్‌లో ఆయన ఒక డేరింగ్, డ్యాషింగ్ వ్యక్తి అని చెప్పారు. కృష్ణ త్వరగా కోలుకోవాలని తాము ప్రార్థిస్తున్నామని, అభిమానులు కూడా దేవుడ్ని ప్రార్థించాలని కోరారు. మరోవైపు.. కృష్ణకు ప్రపంచస్థాయి వైద్యం అందిస్తున్నామని వైద్యులు తెలుపుతున్నారు. అయితే.. ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని, వెంటిలేటర్‌పై ఉన్నారన్నారు. 8 విభాగాలకు చెందిన 8 మంది వైద్య నిపుణులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారన్నారు.
కార్డియాక్ అరెస్ట్‌తో వచ్చినప్పటికీ.. కిడ్నీ, లంగ్స్ ఎఫెక్ట్ అయ్యాయని వైద్యులు పేర్కొన్నారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అని చెప్పవచ్చన్నారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా బ్రెయిన్‌లో బాగా ఎఫెక్ట్ అయ్యిందన్నారు. డయాలసిస్ కూడా జరుగుతోందన్నారు. కృష్ణ ఆరోగ్యంపై ఇప్పుడే ఏం చెప్పలేమని, ఉదయంతో పోలిస్తే ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందన్నారు. తమ వైద్యంతో కుటుంబసభ్యులు సంతృప్తికరంగానే ఉన్నారని వెల్లడించారు.