బాలీవుడ్ డైరెక్టర్ మహేశ్ మంజ్రేకర్ తెలుగువాళ్ళకు సుపరిచితుడే! పలు హిందీ, మరాఠీ చిత్రాలను డైరెక్ట్ చేసిన ఆయన పదిహేనేళ్ళ క్రితం గోపీచంద్ ‘ఒక్కడున్నాడు’ మూవీతో విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుండి అడపా దడపా తెలుగు సినిమాలు చేస్తూనే ఉన్నాడు. చిత్రం ఏమంటే ఆయన హిందీలో డైరెక్ట్ చేసిన కొన్ని సినిమాలు తెలుగులో ఫ్రీ మేక్ కూడా అయిపోయాయి. అయితే ఆ మధ్య ఆయన రూపొందించిన మరాఠీ సినిమా ‘నట సమ్రాట్’ను కృష్ణవంశీ ఇప్పుడు ‘రంగమర్తాండ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే… కొంతకాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు మహేశ్ మంజ్రేకర్ తెలుగులో త్రిగుణ్, పూజిత పొన్నాడ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘కథ కంచికి మనం ఇంటికి’లో నటించాడు. అందులో ఆయన కన్నింగ్ పొలిటీషియన్ పాత్ర చేసినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఆ సినిమా విడుదల కాబోతోంది.
అదే రోజున మహేశ్ మంజ్రేకర్ కుమార్తె సాయీ మంజ్రేకర్ నటించిన ‘గని’ కూడా జనం ముందుకు వస్తోంది. అదే ఆమెకు తెలుగులో తొలి చిత్రం కావడం విశేషం. అయితే ఇక్కడో చిన్న మెలిక ఉంది. సాయీ మంజ్రేకర్ పేరు చూసి, ఆమె మహేశ్ మంజ్రేకర్ సొంత కూతురు అనుకునే వారూ లేకపోలేదు. కానీ ఆమె మహేశ్ మంజ్రేకర్ రెండో భార్యకు మొదటి భర్త ద్వారా పుట్టిన సంతానం. మహేశ్ మంజ్రేకర్ మొదట దీపా మెహతా అనే కాస్ట్యూమ్ డిజైనర్ ను పెళ్ళి చేసుకున్నాడు. వాళ్ళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి దీపా మెహతాకు విడాకులు ఇచ్చి, నటి, నిర్మాత మేథను పెళ్ళాడాడు. ఆమెకు అప్పటికే మొదటి భర్త ద్వారా సాయీ జన్మించింది. తల్లి అడుగు జాడల్లో నడుస్తూ సాయీ కూడా నటిగా మారడం ఓ విశేషం. ఇక మహేశ్ మంజ్రేకర్ రూపొందించిన ‘నట సమ్రాట్’లో అతని భార్య మేథ నానాపటేకర్ సరసన నటించడం మరో విశేషం. మొత్తం మీద ఇప్పుడు ఈ ముగ్గురూ పలు భాషా చిత్రాలతో బిజీబిజీగా ఉన్నారు. అన్నట్టు మహేశ్ మంజ్రేకర్ ఇటీవలే ‘స్వాతంత్ర వీర సావర్కర్’ జీవిత చరిత్రను సినిమాగా తీయబోతున్నట్టు ప్రకటించాడు.