ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకుడే, అంతకు మించిన సంగీత దర్శకుడు! ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రాల్లో ఈ తరం వారికి పలు లోటుపాట్లు కనిపించవచ్చు. కానీ, కృష్ణారెడ్డి స్వరకల్పన మాత్రం ఈ నాటికీ వీనులవిందు చేస్తూనే ఉంటుంది. ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాల్లో వినోదంతో పాటు సంగీతమూ ఆనందం పంచేది. ఎస్వీ జైత్రయాత్ర సాగుతున్న రోజుల్లో పాటలపందిళ్ళు కూడా వేస్తూ సాగారు. ప్రతీచోట జేజేలు అందుకున్నారు. అందుకే కొందరికి ఆయన ‘ఎస్.వి.’ అంటే ‘స్వరాల వరాల కృష్ణారెడ్డి’ అనిపించారు. మరికొందరికి స్వర విన్యాసాల కృష్ణారెడ్డిగానూ కనిపించారు.
ఎస్.వి.కృష్ణారెడ్డి 1960 జూన్ 1న పశ్చిమ గోదావరి జిల్లా ఆరవల్లి గ్రామంలో జన్మించారు. అక్కడి పాఠశాలలోనే చదువుకున్నారు. చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఆసక్తి ఉన్నా, చదువును మాత్రం ఏ నాడూ అశ్రద్ధ చేయలేదు. ఉన్నత చదువులు అభ్యసిస్తూనే సినిమాల్లో నటునిగా అవకాశాల కోసం సాగారు. ‘పగడాల పడవ’ అనే సినిమాలో నటించారు కృష్ణారెడ్డి. ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. నిరుత్సాహ పడలేదు. ఏదో ఒకరోజున చిత్రసీమలో తనకంటూ ఓ రోజు వస్తుందని ఆశించారు. అందుకు మిత్రుడు కె.అచ్చిరెడ్డి ప్రోత్సాహం కూడా తోడయింది. చిరంజీవి ‘కిరాతకుడు’లో విలక్షణమైన పాత్రలో కనిపించారు. హైదరాబాద్ కు వచ్చాక నటన తరువాత తనకు ఎంతో ఇష్టమైన సంగీతం అభ్యసించారు కృష్ణారెడ్డి. కొంతకాలం ఇద్దరు మిత్రులూ కలసి కొన్ని వ్యాపారాలు చేశారు. అయినా వారిలో సినిమాపై ఆసక్తి ఇసుమంతయినా తగ్గలేదు. ఈ మిత్రులకు కిశోర్ రాఠీ తోడయ్యారు. ‘మనీషా’ సంస్థ నెలకొల్పారు. తొలి ప్రయత్నంగా రాజేంద్రప్రసాద్ హీరోగా ‘కొబ్బరిబొండాం’ తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతం, కథ, స్క్రీన్ ప్లే సమకూర్చారు. రవితేజ కాట్రగడ్డ దర్శకత్వంలో రూపొందిన ‘కొబ్బరి బొండాం’ జనాదరణ పొందింది. దాంతో ‘రాజేంద్రుడు- గజేంద్రుడు’ చిత్రంతో మెగాఫోన్ పట్టి డైరెక్టర్ అనిపించుకున్నారు. అందులోనూ రాజేంద్రప్రసాద్ హీరో. ఆ పై వచ్చిన ‘మాయలోడు’లోనూ రాజేంద్రుడే కథానాయకుడు. వరుసగా రాజేంద్రప్రసాద్ తో హిట్స్ చూసిన ఎస్వీ కృష్ణారెడ్డి, కృష్ణ హీరోగా ‘నంబర్ వన్’ చిత్రం రూపొందించి, దానినీ విజయపథంలో పయనింప చేశారు. ఆలీని హీరోగా పరిచయం చేస్తూ ‘యమలీల’ రూపొందించారు. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించి, స్వర్ణోత్సవం చూసింది. అలా ‘మాయలోడు, యమలీల’తో గోల్డెన్ జూబ్లీస్ చూసిన ఎస్వీ కృష్ణారెడ్డిని కొందరు దాసరి నారాయణరావుతో పోల్చారు మరికొందరు కోడి రామకృష్ణతో సరితూచారు. ఏమైనా ముగ్గురూ ఒకే జిల్లా వాసులు కావడం గమనార్హం!
కృష్ణారెడ్డి స్వరకల్పనతోనూ, దర్శకత్వంలోనూ రూపొందిన “టాప్ హీరో, శుభలగ్నం, ఘటోత్కచుడు, మావిచిగురు, వినోదం, ఎగిరే పావురమా, ఆహ్వానం, ఊయల, ప్రేమకు వేళాయెరా, సర్దుకుపోదాం రండి” వంటి చిత్రాలు పాటలతో పరవశింప చేశాయి. వీటిలో కొన్ని విజయఢంకా కూడా మోగించాయి. ‘ఉగాది’ చిత్రంతో హీరోగా కనిపించి ఆకట్టుకున్నారు కృష్ణారెడ్డి. ఆ తరువాత ‘అభిషేకం’లో ద్విపాత్రాభినయంలో కనిపించారు. ‘సంబరం’ అనే చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు.
‘డైవర్స్ ఇన్విటేషన్’ అనే ఇంగ్లిష్ చిత్రానికీ దర్శకత్వం వహించారు కృష్ణారెడ్డి. అదీ అంతగా ఆకట్టుకోలేక పోయింది. 2014లో ఎస్వీ కృష్ణారెడ్డి మరోమారు మ్యాజిక్ చేయడానికి ‘యమలీల-2’ తీశారు. కానీ, అంతగా ఆకట్టుకోలేక పోయారు. ‘యమలీల’ ఈ టీవీ సీరిస్ కూడా ఎస్వీ కృష్ణారెడ్డి రూపకల్పనే! ప్రస్తుతం ‘ఆర్గానిక్ మామ- హైబ్రీడ్ అల్లుడు’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కృష్ణారెడ్డి. టైటిల్ లోనే నవతరం ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం కనిపిస్తోంది. మరి ఈ సినిమాతో ఎస్వీ కృష్ణారెడ్డి ఏ తీరున అలరిస్తారో చూడాలి.