RRR: ఇక్కడ ఒంటికాలిపై కృష్ణుని గెటప్ లో దర్శనమిస్తున్న చిన్నికృష్ణుడు – ఇప్పుడు చిత్రసీమను ఏలేస్తున్నాడు. ఎవరబ్బా ఇతగాడు? ఈ బుడతడి ముఖ కవళికలు చూస్తే బాగా తెలిసినట్టే అనిపిస్తుంది కదూ! మీ అందరికీ బాగా తెలిసినవాడే! ఆ మాటకొస్తే నేడు యావద్భారతదేశాన్నీ అలరించి, అంతర్జాతీయంగానూ విజయబావుటా ఎగురవేస్తోన్న ‘ట్రిపుల్ ఆర్’కు ఈ బాలకృష్ణుడికి సంబంధం ఉంది. ఇంత చెప్పినా, అతనెవరో గుర్తు పట్టలేకపోయారా!? బాగా చూడండి… అతనెవరో కాదు మనందరి ‘జక్కన్న’ … దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి!
ఈ ఫోటో చూసినవారిలో చాలామంది ముందుగా బాలకృష్ణుడి గెటప్ లో ఉన్నది రాజమౌళి చెల్లెలు, సంగీత దర్శకురాలు ఎమ్.ఎమ్.శ్రీలేఖ అని భావిస్తారు. ఎంతయినా జీన్స్ కదా! ఇంతకూ రాజమౌళి ఈ గెటప్ లో కనిపించడానికి కారణమేంటి? ఎపుడైనా కృష్ణాష్టమి ఉత్సవాల్లో చిన్నారి రాజమౌళి బాలకృష్ణునిలా ముస్తాబై అలరించాడా? లేక ఏదైనా సినిమా కోసం ఇలా మురిపించాడా? అంటే – అవును అక్షరాలా ఓ సినిమాలో రాజమౌళి ఇలా బాలకృష్ణుని గెటప్ లో నటించారు. చిత్రమేమిటంటే – ఆ సినిమా ఇప్పటి దాకా వెలుగు చూడలేదు. ఇంతకూ ఆ సినిమా టైటిల్ ఏంటి? ఆ చిత్రం పేరు కూడా కృష్ణునికి సంబంధించిందే! ‘పిల్లనగ్రోవి’. భలే బాగుంది కదూ! ఈ చిత్రానికి రాజమౌళి పెదనాన్న, కీరవాణి తండ్రి అయిన శివశక్తిదత్త దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో చిన్నారి శ్రీలేఖ కూడా నటించింది. 1980ల మధ్యలో ఈ సినిమా రూపొందిందట! ఇందులో సీనియర్ యాక్టర్ మిక్కిలినేని కూడా ఓ కీలక పాత్ర పోషించారు. అందుకు సంబంధించిన ఫోటో కూడా ఇక్కడ పొందు పరిచాము. అందులో మిక్కిలినేని వద్ద కూర్చుని ఉన్నది చిన్నారి శ్రీలేఖ. వారికి సూచనలిస్తూ నమస్కారబాణంతో కనిపిస్తున్నవారు శివశక్తిదత్త.
ఆ ‘పిల్లనగ్రోవి’ ఏ తీరున మ్రోగిందో తెలియదు కానీ, ఆ మురళీనాదం వినే భాగ్యం కలుగలేదు. బాల శిఖిపింఛమౌళిగా నటించిన రాజమౌళి ప్రస్తుతం ఏ తీరున రాజ్యమేలు తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒకవేళ ‘పిల్లనగ్రోవి’ విడుదలై, ఆ సినిమా విజయం సాధించి ఉంటే, శివశక్తిదత్త ఎలా చిత్రసీమలో సాగేవారో? రాజమౌళి నటనలో రాణించేవారేమో? ఇలాంటి అనుమానాలు కలుగక మానవు. ఏది ఏమైనా- చిన్నికృష్ణుని గెటప్ లో ఉన్న రాజమౌళి అరుదైన చిత్రం ‘ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్’కు ప్రత్యేకం అని చెప్పవచ్చు.
Read Also: Special Package For Ap: ప్రత్యేక హోదా స్థానంలోనే ప్రత్యేక ప్యాకేజి