సినిమాలు నిర్మించటం ఓ ఎత్తు. వాటిని సక్రమంగా విడుదల చేయటం ఇంకో ఎత్తు. నిజానికి ఇవాల్టి రోజున సరిగ్గా చక్కటి ప్లానింగ్ తో రిలీజ్ చేయటమే పెద్ద ఎచీవ్ మెంట్. పాన్ ఇండియా సినిమాలకు కూడా ఇది వర్తిస్తుంది. బాలీవుడ్ లో దర్శకనిర్మాతలు తమ సినిమాల విడుదల తేదీలను సంవత్సరం ముందే ప్రకటిస్తూ వస్తున్నారు. కరోనా తర్వాత వారి ప్లానింగ్ కొంచెం అటు ఇటు అయింది కానీ లేకుంటే ప్రచారంలో వారి స్ట్రాటజీనే వేరు.
పాండమిక్ తర్వాత దక్షిణాది సినిమాలలో బడా స్టార్స్ సినిమాలు దాదాపు అన్నీ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్నాయి. నిర్మాణంలో ఉన్న మూవీస్ ని గమనిస్తే అదే విషయం అర్థం అవుతుంది. అయితే దక్షిణాది వారు తమ తమ సినిమాలను పబ్లిక్ లోకి తీసుకు వెళ్ళే విషయంలో ఇంకా బాగా వెనకబడి ఉన్నారనే చెప్పాలి. ఈ విషయంలో రాజమౌళి అండ్ టీమ్ కి మినహాయింపు ఇవ్వవచ్చు. జనవరి 7న సినిమా విడుదల అని ప్రకటించిన తర్వాత తమ చిత్రానికి వరల్డ్ వైడ్ గా ఎంతో క్రేజ్ ఉన్నప్పటికీ పక్కా ప్లాన్ తో ప్రధాన తారాగణాన్ని తీసుకుని సినిమా విడుదల అవుతున్న అన్ని భాషల్లో ప్రెస్ మీట్స్ పెట్టడమే కాదు అడిగిన వారికి అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. తెలుగులో ఇంకా ఇంటర్వ్యూలు మొదలెట్టలేదనుకోండి.
ఈ విషయంలో ఇటీవల విడుదలైన ‘పుష్ప’ టీమ్ ఎంతో వెనకబడిందనే చెప్పాలి. తెలుగులో మాత్రమే ప్రీ రిలీజ్ ఈవెంట్ అదీ దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా చేసింది. దీనికి కారణం పనుల వత్తిడి. రిలీజ్ ముందు రోజు వరకూ వర్క్ జరుగుతూనే ఉంది. సెన్సార్ తో సహా. దాంతో ఉత్తరాదిన రావలసినంత బజ్ రాలేదు. సినిమాలో పొటెన్షియాలిటీ పెట్టుకుని, పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయినా దానిని జనాలలోకి తీసుకుని వెళ్ళే విషయంలో ‘పుష్ప’ టీమ్ చాలా వెనుకబడింది. ఇక ‘శ్యామ్ సింగ్ రాయ్’ సినిమాను దక్షిణాది భాషల్లో విడుదల చేస్తున్నామన్న యూనిట్ తెలుగు మినహా మిగతా భాషల్లో ప్రచారం నిర్వహించే విషయంలో పూర్తిగా వెనుకబడిపోయింది. దాంతో ఇతర భాషల్లో ఈ సినిమా విడుదల అయిందన్న విషయమే తెలియకుండా పోయింది.
అదే ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ తమ సినిమా సెన్సార్ ను అన్ని భాషల్లో ఎప్పుడో పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్, చరణ్ డబ్బింగ్ సినిమాలతో తమిళ, హిందీ, కన్నడ, మలయాళ ప్రేక్షకులకు పరిచయం అయినప్పటికీ నేరుగా వస్తున్న సినిమా కావటంతో భారీ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని భాషల్లో ప్రచారానికి 15 నుంచి 20 కోట్ల వరకూ ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో హంగామా సృష్టించటానికి వేలాది ఎన్టీఆర్, చరణ్ అభిమానులను తీసుకుని వెళ్ళి కేకలు, ఈలలతో కాక పుట్టిస్తున్నారు. దీని వెనుక ఉన్న మాస్టర్ బ్రెయిన్ రాజమౌళిదే. ఈ హైప్ సినిమాపై అంచనాలను ఎవరెస్ట్ కి తీసుకువెళ్ళిందనే చెప్పాలి.
ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ప్రభాస్ ‘రాధేశ్యామ్’ దర్శకనిర్మాతలు పాటిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ని అనుసరిస్తున్నారా? అని ‘రాధేశ్యామ్’ దర్శకుడు రాధాకృష్ణని అడిగినపుడు మంచి విషయాలను అనుసరిస్తే తప్పేంటి అన్నారంటేనే ప్రచారానికి ఉన్న విలువ ఏమిటో తెలుస్తోంది. ‘పుష్ప’ విషయంలో ఏ లోపం జరిగింది. ‘ఆర్ఆర్ఆర్’ వ్యూహం ఎలా ఫలించింది అన్న విషయాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే సినిమాల దర్శకనిర్మాతలు తమ తమ ప్రచార వ్యూహాలను ప్లాన్ చేసుకుంటారేమో చూడాలి.