త్వరలోనే ‘షంషేరా’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్‌కపూర్. జులై 22న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది. ఈ క్రమంలోనే తన తండ్రి రిషి కపూర్‌ను తలచుకొని భావోద్వేగానికి గురయ్యారు రణ్‌బీర్. ఈ సినిమా చూడటానికి ఆయన బతికి ఉండి ఉంటే తాను ఎంతో సంతోషించేవాడనని అన్నారు.
‘షంషేరా’ చూసేందుకు నాన్న బతికి ఉంటే బాగుండు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పని నచ్చినా, నచ్చకపోయినా చాలా నిజాయతీగా చెప్పేవారని.. ఈ సినిమా ఆయన చూడలేకపోవడం చాలా బాధగా ఉందన్నారు. కానీ, ఇలాంటి చిత్రం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని.. ఎక్కడ ఉన్నా ఆయన నా పట్ల గర్వంగా ఉంటారనే భావిస్తున్నానని రణ్‌బీర్ తెలిపారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ని చిత్రబృందం బుధవారం విడుదల చేసింది. చారిత్రక నేపథ్యంతో కూడిన యాక్షన్ సన్నివేశాలతో టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. పోరాట యోధుడు, ఆపదల్లో చిక్కుకున్న తన వర్గాన్ని కాపాడుకునే ఒక వీరుడిగా రణ్‌బీర్ నటన, ఆహార్యం ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాలో సంజయ్ దత్ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు.