Saidharam Tej: సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం ‘విరూపాక్ష’ బాక్సాఫీస్ బరిలో సంచలనాలు సృష్టిస్తోంది. మొదటి ఐదు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ. 55 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. వేసవి సీజన్ కు ‘విరూపాక్ష’ విజయం ఓ పెద్ద ఓదార్పుగా మారింది. విశేషం ఏమంటే… మే 5న విడుదల కాబోతున్న గోపీచంద్ మూవీ ‘రామబాణం’ ట్రైలర్ ను ఈ రోజు నుండి ‘విరూపాక్ష’ థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు. అలానే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను బుధవారం పూర్తి చేసుకుంది. ఎటువంటి కట్స్ లేకుండా ఈ మూవీకి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారని సమాచారం. హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్ లో గతంలో ‘లౌక్యం, ‘లక్ష్యం’ చిత్రాలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆ సినిమాల బాటలోనే శ్రీవాస్ ఇప్పుడు కూడా ఫ్యామిలీ సెంటిమెంట్ ను బేస్ చేసుకుని రివేంజ్ డ్రామాగా ‘రామబాణం’ను తెరకెక్కించాడని అంటున్నారు. మరి వేసవి కానుకగా రాబోతున్న ‘రామబాణం’ ఏమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.